రైల్వే జోన్ రావడంతో బిజెపి శ్రేణులలో సంబరాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్న రెండు రోజుల ముందుగా ఈ ప్రాంత ప్రజలు చాలాకాలంగా కోరుకొంటున్న రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేయడంతో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకై విశాఖపట్నంలో మకాం వేసిన రాష్ట్ర నాయకులు స్వీట్లు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. 

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, విశాఖపట్నం ఎంపీ కె హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి మాణిక్యాల రావు, ఎమ్యెల్సీ పి మాధవ్ తదితరులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలుఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన రైల్వేజోన్‌ ఏర్పాటు ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం ప్రకటించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే పేరుతో నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌, కేంద్రానికి  ఆయన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ప్రకటించడంపట్ల స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు సంతోషం వ్యక్తంచేశారు. తొలినుంచీ దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ రావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతి అయిన తర్వాత వెంకయ్యనాయుడు దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. 

విభజన చట్టంలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే ఉందని, దానిపై  సదానందగౌడ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే కమిటీ వేసి అధ్యయనం చేయించిందని, అందులో సాధ్యంకాదని తేలిందని పేర్కొన్నారు. అయినప్పటికీ దాన్ని పక్కనపెట్టకుండా  అందరితో మాట్లాడి సంక్లిష్ట సమస్య పరిష్కారానికి రైల్వేశాఖ కసరత్తు చేసిందని హరిబాబు కొనియాడారు. 

 దక్షిణకోస్తా పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన కానుక అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. విశాఖపట్నం వస్తున్న సందర్భంగా మోదీ ఇచ్చిన కానుకను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. దశాబ్దాలుగా నెరవేరని కల ఎన్డీయే ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంతో నెరవేర్చిందని పేర్కొన్నారు.