రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు బెయిల్

ఐఆర్‌సీటీసీ భూ కుంభకోణం కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి  రబ్రీ దేవి, ఆమె కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ పటియాలా కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ కోర్టు ప్రొడక్షన్‌ వారెంట్‌ జారీ చేసింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన క్రమంలో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ నేడు కోర్టు ఎదుట హాజరు కాలేకపోయారు. 

ఐఆర్‌సీటీసీ స్కామ్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌ సహా 13 మంది ఇతరులపై ఈడీ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. చార్జిషీట్‌లో ఆర్జేడీ నేత , కేంద్ర మంత్రి ప్రేమ్‌ చంద్‌ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, సంస్థ లారా ప్రాజెక్ట్స్‌ పేర్లనూ ప్రస్తావించింది.

పూరి, రాంచీల్లో రెండు రైల్వే హోటళ్లను నిబంధనలకు విరుద్ధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం లాలూ, ఐఆర్‌సీటీసీ అధికారులు విజయ్‌, వినయ్‌ కొచ్చర్‌లకు చెందిన సుజాత హోటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్కు కట్టబెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇందుకు ప్రతిగా లాలూ సన్నిహితుడైన పీసీ గుప్తాకు చెందిన డిలైట్‌ మార్కెటింగ్‌ కంపెనీకి మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరలో విలువైన భూమిని బదలాయించారని పేర్కొన్నాయి. వీటిలో వాటాలు దక్కించుకోవడం ద్వారా అతితక్కువ ధరకే విలువైన భూమిని రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్‌లు సొంతం చేసుకున్నారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి.