మీ రాజ్యసభ సభ్యులను నిలదీయండి.. మోదీ పిలుపు

రాజ్యసభలో  ప్రతిపక్షాలు చేతులు కలిపి ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శిస్తూ మీమీ ప్రాంతాలలోని సభ్యులను నిలదీసి ఈ విషయమై ప్రశ్నించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్ర సంఘటన్ సంయుక్త ఆధ్వర్యంలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉండటం వల్ల, ప్రభుత్వ బిల్లుల ఆమోదానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని, వీటి ప్రభావం దేశంపై పడుతున్నదని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టంకట్టడంతో లోక్‌సభలో 85 శాతం మెజార్టీ (గతంలో కంటే 20 శాతం ఎక్కువ మెజార్టీ)తో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని, పూర్తి మెజార్టీ రావడంతో 205 బిల్లులను ఆమోదించామని చెప్పారు. 

కానీ, రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు చేతులు కలిపి ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో గత బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఎనిమిది శాతం బిల్లులే ఆమోదం పొందాయని పేర్కొన్నారు. ఏప్రిల్- మే నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్లి, భారీమెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 

పార్లమెంట్ ఫెస్టివల్‌కు హాజరైన యువత స్వస్థలాలకు చేరుకున్నాక ఆయా ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వాటికి రాజ్యసభ సభ్యులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి సభలో ఆమోదానికి నోచుకోని బిల్లుల అంశంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. 

ఫెస్టివల్‌లో పాల్గొన్న యువత మరింత స్ఫూర్తి పొంది ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్‌ను సందర్శించాలని మోదీ సూచించారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. 

ఏడు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఆదాయపన్ను చెల్లించిన వారి సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నగదురహిత లావాదేవీలపై ప్రచారం చేయాలని కోరారు.