వాయుసేన మెరుపుదాడులతో చంద్రబాబులో ఖంగారు !

సరిహద్దును దాటి పాకిస్థాన్ భూభాగంలో నెలకొన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, 350 మంది వరకు హతమార్చి భారత వాయుసేన విమానాలు తిరిగి రావడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖంగారుకు గురికావడం కనిపిస్తున్నది. ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భారత వాయుసేనకు మద్దతు ప్రకటిస్తూ దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలు ప్రకటనలు జారీ చేస్తే చంద్రబాబుకు వెంటనే నోటా మాటరాలేదు. ఏ విధంగా స్పందించాలో అర్ధంకాకా తికమక పడ్డారు. మధ్యాహ్నంకు గాని ఆయన స్పందన ఆరాలేదు. 

అంతకు ముందే పుల్వామా వద్ద ఉగ్రవాద దాడి సందర్భంగా పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు నైతిక మద్దతు తెలిపే రీతిలో అస్పష్టమైన ప్రకటన చేసి వివాదంలో చిక్కుకున్నారు. భారత సేనలను కించపరిచే విధంగా మాట్లాడారని విమర్శలకు గురయ్యారు. ఇటువంటి సమయంలో ఈ మెరుపు దాడులు ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడవేశాయి. బుధవారం ప్రతిపక్ష నేతల సమావేశంలో పాల్గొనడానికి ఎటూ ఢిల్లీకి వెడుతున్నారు. కానీ మంగళవారమే ఆ నేతల అందరికి ఫోన్లు చేసి ఎట్లా స్పందించాలని అంటూ సమాలోచనలు జరిపారు. 

మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ అజాద్‌, జమ్మూకశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తదితరులతో ఫోన్ లలో మంతనాలు జరిపారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు, దాని పర్యవసానాలు, రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై ఆ నేతలతో సీఎం చర్చించారు. మమతా బెనర్జీతో అయితే రెండు దఫాలు  మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆమెతో ప్రత్యేకంగా చర్చించారు. 

మెరుపు దాడులు దేశ వ్యాప్తంగా ప్రజలను భావోద్వేగాలకు గురిచేసే అవకాశం ఉన్నదని, దానితో వచ్చే ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రయోజనం పొందుతారని ఆందోళన ఆయనలో వ్యక్తం అవుతున్నది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మోదీ ఇక ప్రధాని అయ్యే అవకాశం లేదనే భరోసాతో ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. తనకు చెప్పిన వ్యక్తే ఢిల్లీలో ప్రధాన మంత్రి అవుతారంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. 

మెరుపు దాడులు జరిగిన కొద్దీ సేపటికే ప్రధాన మంత్రి మోదీ రాజస్థాన్ లో జరిగిన బహిరంగసభలో చేసిన ప్రసంగం, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మరోచోట చేసిన ప్రసంగములను గమనిస్తే వచ్చే ఎన్నికలలో ఈ అంశం ప్రధానంగా మారే అవకాశం కనిపిస్తున్నది. దేశాన్ని కాపాడాలి అంటే కేంద్రములో బలమైన ప్రభుత్వం ఏర్పడాలని, అతుకులబొంత ప్రభుత్వం ఏర్పడితే దేశానికి ముప్పు అనే సందేశం ప్రజలకు చేరే అవకాశం ఉన్నదని భయం ఇప్పుడు చంద్రబాబును వెంటాడుతున్నది. 

గతంలో వాజపేయి ప్రభుత్వం కార్గిల్ యుద్ధం చేసిన తర్వాత కొద్దీ నెలలకు జరిగిన ఎన్నికలలో బిజెపితో కలసి పోటీ చేసిన చంద్రబాబు ఘన విజయం సాధించడం తెలిసిందే.  కార్గిల్ యుద్ధం సెంటిమెంట్ టీడీపీకి కూడా బాగా కలసి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మోడీని, బీజేపేని ఏపీ ప్రజలకు నమ్మి మోసం చేసిన వారుగా చిత్రీకరించడంలో కొంతమేరకు విజయం సాధించారు. ఇప్పుడు మెరుపు దాడుల ప్రభావం ఏపీలో కూడా పడే అవకాశం ఉంది. ఆ ప్రభావంతో ఏపీలో బీజేపీ భారీ సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం లేకపోయినా, మోడీని నిత్యం దూషించే చంద్రబాబు ప్రజల దృష్టిలో తిరస్కారానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. ఆ భయమే ఇప్పుడు చంద్రబాబును వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. 

పైగా తిరిగి కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే తన ప్రభుత్వంపై ప్రస్తుతం బీజేపీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవలసి వస్తుందనే విషయం ఆయనకు తెలుసు. "మోడీకి తిరిగి అధికారం, చంద్రబాబు జైలుకు" అంటూ పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తుండటం తెలిసిందే.