ప్రధాని మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే వైమానిక దాడులు

మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్య పోయే రీతిలో భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులను  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తున్నది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ప్రధాని మోదీ పదే పదే చెబుతూ వచ్చారు. సమయం, లక్ష్యం నిర్దేశించుకోవాలంటూ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 

చెప్పినట్లుగానే ఉగ్రమూకల స్థావరాలపై మంగళవారం భారత వాయుసేన విరుచుకుపడింది. వందలాది జైషే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. అత్యంత అప్రమత్తతో పాటు, అతి జాగ్రత్తగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు విశ్వసనీయ సమాచారం. 

రాష్ట్రపతి భవన్‌లోని సౌత్‌ బ్లాక్‌లో ఉండి యుద్ధ విమానాల కదలికల్ని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించినట్లు తెలుస్తోంది. ఉదయం 3.58గంటల నుంచి 4.04 మధ్య దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో మోదీ రాష్ట్రపతి భవన్‌ సౌత్‌ బ్లాక్‌లోని నియంత్రణా గదిలోనే ఉన్నట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. 

ఈ దాడికి ప్రణాళికలు రూపొందించిన వాయుసేనాధిపతి బీఎస్‌.ధనోవాకు ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జాతీయ భద్రతా సలహాదారు ప్రధానికి ముందే వివరించారు. ఇటీవల త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో దాడికి సంబంధించిన పూర్తి ప్రణాళికను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు సమాచారం. తర్వాత తలెత్తే పరిణామాలపై కూడా చర్చ జరిగింది. 

అయితే పుల్వామా దాడికి ప్రతీకారంగానే ఈ దాడి నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. 2016లో జరిగిన మెరుపు దాడులను కూడా మోదీ స్వయంగా అజిత్ డోబాల్‌తో కలిసి పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన మర్నాడే పాక్‌పై దాడికి తుది రూపునిచ్చేశారు. ఆ తర్వాత అత్యంత గోప్యంగా కార్యాచరణను అమలు చేశారు. ఈ క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విషయం ఏ మాత్రం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా 350 మంది ఉగ్రవాదులను హతమార్చారు.

 ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల ప్రణాళికను ఐఏఎఫ్‌ ప్రభుత్వానికి అందజేసింది. దీనికి ప్రభుత్వం వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఫిబ్రవరి 16-20 వరకు సరిహద్దుల వెంట ఐఏఎఫ్‌, భారత సైన్యం సంయుక్తంగా నిఘాను పెట్టాయి. వివిధ మార్గాల్లో ప్రత్యర్థి శిబిరాల సమాచారాన్ని సేకరించాయి.ఫిబ్రవరి 20-22 మధ్యలో దాడులు చేయాల్సిన ప్రదేశాలను గుర్తించి మ్యాప్‌లు సిద్ధం చేసుకొన్నాయి. ఫిబ్రవరి 21న ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోబాల్‌ నేతృత్వంలో లక్ష్యాలను నిర్దేశించారు.

 ఫిబ్రవరి 22వ తేదీ భారత వాయుసేనలో టైగర్‌ స్క్వాడ్రన్‌, బాటిల్‌ యాక్సెస్‌ స్క్వాడ్రన్‌లను పూర్తిగా సిద్ధం చేశారు. అదే రోజు రెండు స్క్వాడ్రన్ల నుంచి 12 మిరాజ్‌ 2000లను ఈ ఆపరేషన్‌కు ఎంపిక చేశారు.  ఫిబ్రవరి 24వ తేదీన భారత్‌ మధ్య ప్రాంతంలోని గగనతలంపై ఆపరేషన్‌ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఫిబ్రవరి 24వ తేదీన భారత్‌ మధ్య ప్రాంతంలోని గగనతలంపై ఆపరేషన్‌ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.