బ్యాంకులకు వరుస సెలవలు వదంతులు మాత్రమె

సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు  మూతపడనున్నాయనే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం త్రోసిపుచ్చింది.  వాట్సాప్‌, తదితర గ్రూపుల్లో  విపరీతంగా షేర్‌ అవుతున్న మెసేజ్‌లతో ప్రజలు ఆందోళనకు గురికానవసరం లేదని స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆరో రోజులు సెలవు అనే వదంతుల్లో ఏమాత్రం నిజంలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు.

ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుందన్న వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వరసగా మూడు రోజులకు మించి సెలవులు ఉండవని గుర్తు చేసారు.

ఆదివారం నుంచి బ్యాంకులు ఆరు రోజులపాటు మూతపడనున్నాయనే వార్తల్లో నిజం లేదని సంఘం  ఉపాధ్యక్షుడు అశ్వానీ రాణా తెలిపారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని ఆయన వివరణ ఇస్తూ ఆ సమ్మెమూలంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని  పేర్కొన్నారు. 

అలాగే జన్మాష్టమి ఐచ్ఛిక సెలవేనని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3న సెలవు అని రాణా తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి.

కాగా సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, సెప్టెంబర్ 3 జన్మాష్టమి.  ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె  చేపట్టనున్నారని, దీంతోపాటు 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరస సెలవులంటూ మెసేజ్‌లు విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.