ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రధాని భరోసా

 ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను" అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.  పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ  ఈ గడ్డపై నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ దేశాన్ని ఎప్పటికీ మరణశయ్యపైకి తీసుకెళ్లను.. ఈ దేశం ఎప్పటికీ ముందడుగు వేయకుండా ఆగదు.. ఈ దేశం ఎప్పటికీ తల వంచదని స్పష్టం చేశారు.

"భరతమాతకు మాటిస్తున్నాను.. మీ తల ఎప్పటికీ వంచనీయను. సాయుధ బలగాలకు సెల్యూట్ చేస్తున్నా. భారతీయులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ ప్రధాన సేవకుడు మీకు తలవంచుతున్నాడు" అని మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. దేశం మేల్కొని ఉందని.. ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

‘‘ఈ దేశానికి నేను భరోసా ఇస్తున్నా. జాతి ఖ్యాతి విరాజిల్లేలా మన జెండా సగర్వంగా ఎగిరేలా మనం నిలబడతాం. ఈ మట్టిలోనే పౌరుషం ఉంది. మన ప్రతాపాన్ని చాటుదాం. యావత్ జాతికి ఇదే మాట ఇస్తున్నా’’ అని ప్రధాని పేర్కొన్నారు.  మన దేశంపై శత్రువు కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జై జవాన్‌, జై కిసాన్‌ అనేది తమ నినాదమని చెప్పారు.

2014లో తాను అధికారం వచ్చినప్పుడు దేశ ప్రయోజనాలను కాపాడతానని తనకు హామీ ఇచ్చానని గుర్తు చేస్తూ మీరిచ్చిన వోట్ తన  ప్రభుత్వాన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకొనేతలంటూ చేస్తున్నదని తెలిపారు. "కేవలం మీరిచ్చిన ఒక్క వోట్ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో కూడా మీరు ఆ వోట్ ను ఇచ్చే ఢిల్లీలో బలమైన ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి" అంటూ ప్రజలను కోరారు.

సగర్వ భారతావని తల ఎత్తుకునే ఉంటుంది. ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని ప్రధాని హామీ ఇచ్చారు. జాతి ప్రయాణం ఆగదు.. ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది" అంటూ భావావేశంలో ప్రసంగించారు. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పదనే భావనతో పనిచేస్తున్నామని చెబుతూ ఓఆర్‌ఓపీ కింద మాజీ సైనికులకు రూ.35వేల కోట్లు అందించామని గుర్తు చేశారు.

కాగా, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దేశవ్యాప్తంగా రైతులకు తొలి విడత నగదు జమ జరిగిందని చెబుతూ రాజస్థాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల జాబితా పంపలేదని ప్రజలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా కోసం కేంద్రం ఎదురుచూస్తోందని చెప్పారు. రాజకీయాల కోసం రైతులకు రావాల్సిన డబ్బులను అడ్డుకోవద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఇలాంటి పథకాలను కూడా రాజకీయం చేయాలని చూస్తుంటే బాధేస్తోందని తెలిపారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశంలో 13 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలుపుతూ నాలున్నరేళ్లలో పేదల కోసం 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్నామని ప్రధాని వివరించారు.