విహార యాత్రకు పరిమితం చంద్రబాబు పాలన

 రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన విహార యాత్రలకే పరిమితమైందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ధ్వజమెత్తారు. గుంటూరులో బీజేపీ ఆర్యంలో జరిగిన మేధావుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు గడిచిన నాలుగున్నరేళ్లలో విదేశీ పర్యటనల కోసం రూ.600 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆయన చేసిన విహారయాత్రల ఖర్చుతో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవని ఎద్దేవా చేసారు. 

తన మామ ఎన్‌టీఆర్‌తో పాటు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌లకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని జవదేకర్ ధ్వజమెత్తారు.  పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో సైనికులు వీరమరణం పొందితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పాకిస్థాన్‌కు మద్దతు తెలపడం దారుణమని విమర్శించారు. పుల్వామా దాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని, ఇంతకన్నా దారుణమైంది మరొకటి లేదని మండిపడ్డారు. 

గడిచిన ఐదేళ్లకాలంలో ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఉగ్రవాద నిర్మూలనకు ఎన్నో చర్యలు చేపట్టామని, ఫలితంగా 590 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఏ యుద్ధంలోనూ భారతదేశంపై పాకిస్థాన్ గెలవలేదని గుర్తు చేశారు. అందుకే దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్‌కు పంపిస్తూ దేశద్రోహులతో కలిసి పరోక్ష యుద్ధం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా సైన్యానికి పూర్తిస్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. 

 కాశ్మీర్ లోయలో ఉన్న వేర్పాటువాద నాయకులకు కేంద్రప్రభుత్వం సెక్యూరిటీని తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే పాకిస్థాన్ నుండి దిగుమతి అయ్యే సరుకులపై 200 శాతం పన్ను విధించడంతో పాటు ఆ దేశానికి నదుల నుండి వెళ్లే నీటిని కూడా నిలిపివేశామన్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు నేతృత్వం వహించిన వారిని గూండాలుగా కాంగ్రెస్ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మరింత వేగం పుంజుకుందన్నారు. స్వతంత్ర భారతావనిలో ఏ ప్రధాని అమలుచేయని విధంగా మోదీ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సత్యమూర్తి, సురేష్‌రెడ్డి, జమ్ముల శ్యామ్‌కిషోర్ కూడా  పాల్గొన్నారు.