అన్ని రక్షణ కుంభకోణాలకూ తల్లి కాంగ్రెస్సే

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన రక్షణ శాఖ  కుంభకోణాలన్నింట్లోనూ కాంగ్రెస్ ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. బోఫోర్స్ నుంచి చాపర్స్ వరకూ గల అన్ని దందాలు డీల్స్ ఒక ఫ్యామిలీనే నడిపించిందని పరోక్షంగా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.

ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ’నేషనల్ వార్’ మెమోరియల్‌ను  ప్రధాని మోదీ ప్రారంభిస్తూ అమర జవాన్లను ఇండియా ఎన్నడూ మరిచిపోదని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 26,000 మంది వీరజవాన్ల  స్మృతిచిహ్నంగా ’జాతీయ వార్ మెమోరియల్’ ఏర్పాటు చేశామని చెప్పారు. వార్ మెమోరియల్ ఏర్పాటు ద్వారా అమరవీరులను ఎట్టకేలకు దేశం గౌరవించుకోలుగుతోందని తెలిపారు.

తనకన్నా ముందు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు సాయుధ దళాలు, జాతీయ భద్రత పట్ల నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని మండిపడ్డారు.  సాయుధ దళాల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి హెలికాప్టర్ల కొనుగోళ్ల వరకు అన్ని విషయాలలో నిర్లక్ష్యం చూపిందని, ఇప్పుడు ఆ పార్టీ రాఫెల్ విమానాలను వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. దేశం ముఖ్యమా లేక కుటుంబం ముఖ్యమా అని ఆయన సభకు హాజరైన మాజీ సైనికులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభికులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.

భద్రతా దళాల అవసరాలను తీర్చాల్సి వచ్చినప్పుడు పూర్వ ప్రభుత్వాలు నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి అని ఆరోపించారు. అమరవీరులను గౌరవించడం వల్ల రాజకీయంగా తమకు ఎటువంటి లాభం లేదన్న ఆలోచనతోనే వారు ఆ విధంగా వ్యవహరించి ఉండవచ్చని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని నిర్మించాలని ఎప్పుడో నిర్ణయించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదని ప్రధాని విమర్శించారు. సైనికుల కోసం త్వరలోనే తాము మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్మించనున్నామని చెప్పారు.

సైనికుల 60 ఏళ్ల చిరకాల కోరిక నెరవేరిందని చెబుతూ దేశ బలగాలు, రక్షణ రంగ పటిష్టతకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. సైనికులకు ’వన్ మ్యాన్ వన్ ర్యాంక్’ అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందని గుర్తు చేశారు. బలగాల్లో మహిళల పాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ అలాంటి నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని అందరూ అన్నా తాము సుసాధ్యం చేసి చూపించామని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల సేకరణలో మార్పులు చేశామని, రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రైవేటు కంపెనీల సంఖ్య కూడా మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని వెల్లడించారు. 

జాతీయ భద్రత విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీ పడ్డాయని మోదీ ఆరోపించారు. తాము మాత్రం దేశ రక్షణ, బలగాల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చామని, అస్సాల్ట్ రైఫిల్స్ కోసం భారీ ఆర్డర్లు ఇచ్చామని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల కోసం 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూవ్ జాకెట్లు కొనుగోలు చేశామని, మరో 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూవ్ జాకెట్లు సమకూర్చనున్నామని చెప్పారు.

భారత సైనిక శక్తి ప్రపంచదేశాలకు చాటామని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, సైనిక కుటుంబాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.