వీరజవాన్ల అమరత్వాన్ని సముచిత స్మారకం

ఇండియాగేట్ ఆవరణలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.176 కోట్ల వ్యయంతో జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని నిర్మించారు. స్మారక కేంద్రం మధ్య నిర్మించిన రాతి స్తంభం కింద దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆ కేంద్రా న్ని జాతికి అంకితం చేశారు. ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా వైమానిక దళ హెలికాప్టర్లు ఆ ప్రాంగణంపై గులాబీ రేకుల వర్షాన్ని కురిపించాయి.

ఈ స్మారక కేంద్రంలో అమర్ చక్ర, వీర్‌తా చక్ర, త్యాగ్ చక్ర, రక్షక్ చక్ర పేరిట 4 గోడలను వృత్తం ఆకారంలో నిర్మించారు. ఆ గోడలకు అతికించిన గ్రానైట్ బిల్లలపై 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారు. వీర్‌తా చక్ర ఆవరణం లో, భారత సాయుధ దళం, వాయుసేన, నౌకాదళం పాల్గొన్న ప్రతిష్ఠాత్మక యుద్ధాలను వివరించే ఆరు కాంస్య కుడ్య చిత్రాలను నిర్మించారు. కేంద్రం మధ్యలో నిర్మించిన రాతి స్తంభంపైన అశోకుని సింహాలు, అడుగున నిత్యం వెలిగే అమరజ్యోతి, దాని గోడపై కవి జగదాంబ ప్రసాద్ రాసిన షహీద్ కీ మజ్రోన్ పర్.. కవిత రాసి ఉంది.

 దేశానికి స్వాతంత్య్రం లభించాక యుద్ధ వీరుల త్యాగాలను స్మరించుకొనేందుకు దేశంలో ఇంతవరకు ఎటువంటి స్మారకం ఏర్పాటుచేయలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లో జాతీయ యుద్ధ స్మారకం నిర్మించారు. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం, 1947, 1965, 1971లో జరిగిన భారత్ -పాక్ యుద్ధం, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ అసువులు బాసిన వీర సైనికులకు, శ్రీలంకలో శాంతి పరిరక్షణకు వెళ్లి బలైన భారత జవాన్లకు ఈ స్మారకం నివాళి అర్పిస్తుంది.

ఈ జాతీయ యుద్ధ స్మారక ప్రాజెక్టుకు కేం ద్రం 2015, డిసెంబర్ 18న అనుమతి మంజూరు చేయగా, గతేడాది ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. ఈ కేంద్రంలోని త్యాగ్ చక్ర ఆవరణలో పురాణాలలో పేర్కొ న్న యుద్ధ వ్యూహాల్లో ఒకటైన చక్రవ్యూ హం ఆకారంలో 16గోడలు నిర్మించారు. ఆ గోడలకు గ్రానైట్ బిళ్లలు అతికించి, ఒక్కోదానిపై ఒక్కో అమరజవాన్ పేరు, సైన్యం లో వారి హోదా, వారు ప్రాతినిధ్యం వహించిన రెజిమెంట్ వివరాలను రాశారు. రక్షక్ చక్రగా పేరుపెట్టిన బాహ్య వలయంలో 600కి పైగా చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టు దేశ ప్రాదేశిక సమగ్రతను ప్రతినిత్యం కాపాడుతున్న సైనికులకు ప్రతిబింబంగా ఉన్నాయి.

1971 నాటి యుద్ధంలో నేలకొరిగిన సైనికుల స్మృత్యర్థం ఇండియాగేట్ వద్ద 1972లో నెలకొల్పిన అమర్ జవాన్ జ్యోతి అక్కడే ఉంటుందని, ఇకపై దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించే ప్రదేశంగా జాతీయ యుద్ధ స్మారకం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటీషు పాలనా కాలంలో ఇండియాగేట్‌ను యుద్ధ స్మారకంగానే నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం, 1919 లో జరిగిన మూడో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం లో మరణించిన సైనికుల గౌరవార్థం ఇండియాగేట్‌ను అఖిల భారత యుద్ధ స్మారక కమానుగా నిర్మించారు.

ప్రధాన స్మారక కేంద్రం పక్కన, ఇండియాగేట్‌కు ఉత్తర దిశలో పరమ్ యోద్ధాస్థల్ పార్కును నిర్మించారు. ఈ ఆవరణలో.. దేశ అత్యున్నత శౌర్య పతాకమైన పరమ వీర చక్ర అవార్డును అందుకున్న 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో ప్రస్తుతం జీవించి ఉన్న సుబేదార్ మేజర్ బానా సింగ్ (రిటైర్డ్), సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ విగ్రహాలు కూడా ఉన్నాయి.