ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భారత్ వృద్ధి పతంలో దూసుకుపోతుండటంతో వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా వినిమయం అంచనాలకుమించి ఊపందుకోవడం, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు దోహదం చేయనున్నాయని మంత్రి తెలిపారు.ఇదే క్రమంలో వచ్చే 10 నుంచి 20 ఏండ్లకాలంలో మూడో స్థానానికి ఎగబాక గలమని ధృడ విశ్వాసం వ్యక్తం చేసారు.

విలువ పరంగా చూస్తే ఈ ఏడాది ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్ వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనున్నట్లు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి వ్యాఖ్యానించారు. 2017 చివరినాటికి భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.597 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదే సమయంలో 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థను దాటేసింది. తలసరి జీడీపీ విషయానికి వస్తే ఫ్రాన్స్‌తో పోలిస్తే చాలా దూరంలో భారత్ నిలిచిందని, 20 రెట్ల కంటే అధికంగా ఉన్నదని పేర్కొంది.

ఇందుకు ప్రధాన కారణం జనాభా. ప్రస్తుతం భారత జనాబా 134 కోట్లుగా ఉండగా, అదే ఫ్రాన్స్‌లో 6.7 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2.94 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. గతేడాది 6.7 శాతం వృద్ధిని కనబరిచిన భారత్ ఈ సారికిగాను 7.4 శాతానికి చేరుకోనున్నదని ముందస్తు అంచనాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుండటం, సాధారణ వర్షాలు కురుస్తుండటం ఇందుకు కారణమని విశ్లేషించాయి.

తక్కువ స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకుంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలను దాటడం చాలా కష్టమని, సరాసరిగా 7-8 శాతం స్థాయిలో నమోదైతే తప్పా ఇది సాధ్యంకాదన్నారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ర్టాలు అధిక వృద్ధిని నమోదు చేసుకుంటుండగా, తూర్పు రాష్ర్టాలు మాత్రం వెనుకబడ్డాయని మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే రెండు దశాబ్దకాలంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించనుండటంలో సీసీఐ కీలక పాత్ర పోషించనున్నదని, నూతన ఇనిస్టిట్యూట్‌లో మరింత మందికి శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.