దళిత్ నేతల పట్ల కాంగ్రెస్ లో వివక్షత... కర్ణాటక డిప్యూటీ సీఎం

దినదిన గండంగా ఉన్న కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దళిత్ నేతల పట్ల వివక్షత కొనసాగుతుందని అంటూ పెద్ద ఆరోపణ చేశారు. తాను దళితుడిని కాబట్టే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మూడు సార్లు కోల్పోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉపముఖ్యమంత్రి పదవికి అంగీకరించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

జేడీఎస్ నేత కుమార స్వామికి సీఎం పదవి ఇవ్వడంపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల అసంతృప్తితో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. ఉపముఖ్యమంత్రి పరమేశ్వర చేసిన తాజా వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్టైంది. నిన్న దేవనాగరేలో జరిగిన దళితుల ర్యాలీలో పరమేశ్వర మాట్లాడుతూ  

‘‘అణచివేతకు నేను కూడా బాధితుడినే. దళితుడిని కాబట్టే నాకు సీఎం పదవి దక్కలేదు. నాకు ఆసక్తి లేకపోయినా.. అయిష్టంగానే ఉపముఖ్యమంత్రి పదవికి ఒప్పకున్నాను...’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లోని మరికొందరు దళిత నేతలను కూడా పరమేశ్వర ప్రస్తావించారు. 

బసవలింగప్ప, కేహెచ్ రంగనాధ్, కలబుర్గి ఎంపీ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు సైతం దళితులు కాబట్టే  రాష్ట్రాన్ని నడింపించే అవకాశం కోల్పోయారని ఘాటైన విమర్శలు చేశారు. ‘‘వాళ్లంతా ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్లు. అయినప్పటికీ దళితుల పట్ల వివక్ష కారణంగా బాధితులుగానే మిగిలిపోయారు..’’ అంటూ పరమేశ్వర పంచ్ విసిరారు. తన అసంతృప్తిని వెల్లడించి, దళితుల మద్దతు కోరేందుకే ఈ ర్యాలీకి వచ్చినట్టు ఆయన పేర్కొనడం గమనార్హం. 

ఇప్పటికీ కర్నాటక గ్రామీణ ప్రాంతాల్లో దళితులు అస్పృతకు బలవుతున్నారనీ, దేవాలయాలు, హోటళ్లు, బార్బర్ షాపుల్లోకి దళితులను రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. అణగారిన వర్గాల వారికి రాజ్యాంగం హక్కులు కల్పించినప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతుండడం దారుణమని విమర్శించారు. దళితులంతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను తమ దేవుడిగా పూజించాలని పరమేశ్వర హితవు చెప్పారు. 

కాగా సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ నేతల్లో గుబులురేపుతున్నాయి.  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా అయిన ఆయన ఇంతకు ముందు కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్యకు ప్రత్యర్థిగా ఉంటూ వచ్చారు. పైగా, రాష్ట్రంలో దళిత్ ఉద్యోగులు ప్రభుత్వంలో వివక్షతకు గురవుతున్నారని కూడా మండిపడ్డారు. 

ఇలా ఉండగా, దళితుడిని కాబట్టే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంటూ కర్నాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత బీఎస్ ఎడ్యూరప్ప సమర్థించారు. దళితులు కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా లేరని ఆయన దుయ్యబట్టారు.  ‘‘కాంగ్రెస్ పార్టీతో దళితులు సంతోషంగా లేరు. తాను దళితుడిని కాబట్టే మూడు సార్లు సీఎం పదవి దక్కకుండా చేశారని ఆయన (పరమేశ్వర) చెప్పారు. కర్నాటక దళితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి..’’ అని ఆయన పేర్కొన్నారు.