మోదీయే ప్రధాని..లేదంటే 50 ఏళ్లు వెనక్కి

నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాని పక్షంలో దేశం 50ఏళ్లు వెనక్కి వెళుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటే మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ బిజెపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకపోతే తొలిసారి ఓటు వేయబోతున్న యువతరాన్ని నిరాశకు గురిచేసినవారవుతారని తెలిపారు.

మోదీ వంటి నాయకుడు చాలా అరుదుగా లభిస్తారంటూ ప్రధాని పనితీరును ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని ఆమె స్పష్టం చేశారు. 2019 ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.  కార్యకర్తలు 2013-14 కంటే ఇప్పుడు పదింతలు కష్టపడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా నిర్మలా సీతారామన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపైన బురదజల్లడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. గత ఐదేళ్లలో కశ్మీర్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సైనికులకు కనీసం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కూడా లేవని ఆరోపించారు. కానీ గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

ఆధునిక సాంకేతికతను సైన్యానికి సమకూర్చామని చెబుతూ అందుకోసం గత రక్షణ శాఖ మంత్రులు మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పుల్వామా దాడిపై స్పందిస్తూ..  పాక్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆమె స్పష్టం చేసారు. రఫేల్‌ డీల్‌పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆమె.. సెప్టెంబరు 19న తొలి రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానుందని తెలిపారు.