కశ్మీర్‌ సమస్యకు నెహ్రూ విధానాలే కారణం

 

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ గతంలో అనుసరించిన తప్పుడు విధానాల వల్లే కశ్మీర్‌ అంశం ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదని బిజెపి  జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో జమ్ము, కశ్మీర్‌వాసి ప్రమేయముండటాన్ని గత కొద్ది రోజులుగా విపక్షాలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. 

జమ్మూలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  కేంద్రం సరైన చొరవ చూపి కశ్మీర్‌లో శాంతి నెలకొల్పకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

‘నేను ఆయనకు(రాహుల్‌) ఓ విషయం చెప్పదలచుకున్నాను. కశ్మీర్‌పై ఇవాళ మీరు లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికి కారణం మీ గొప్ప తాత జవహర్‌లాల్‌ నెహ్రూ. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను మన బలగాలు జయించటానికి వెళ్లినప్పుడు ఎవరు ఆపింది? జవహర్‌లాల్‌ నెహ్రూనే’ అంటూ అమిత్‌ షా ధ్వజమెత్తారు. 

1947లో భారత్‌, పాక్‌ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. జమ్మూ, కశ్మీర్‌ సమస్యకు బీజేపీ మాత్రమే శాశ్వత పరిష్కారం చూపగలదని షా స్పష్టం చేశారు. భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగమని, దాన్ని ఏ శక్తీ విడదీయలేదని చెప్పారు. ‘శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ప్రాణాలు విడిచిన కశ్మీర్‌ మనదే‘నని షా ఉద్ఘాటించారు.  

ఇలా ఉండగా, తాము అసోంలో అనుసరించిన విధానంలోనే దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ దేశాల నుంచి అక్రమంగా తరలివచ్చి చట్టవ్యతిరేకంగా నివాసముంటున్న అక్రమ వలసదారులందరినీ తరిమివేయడం ఖాయమని అమిత్‌షా స్పష్టం చేశారు.  దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారినందరినీ వెళ్లగొట్టేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. దేశంలోని ఉగ్రవాదాన్ని అణచివేస్తామని, అది సున్నా శాతానికి తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. 

గతంలో దేశాన్ని పాలించే ప్రభుత్వాలు లడక్, జమ్మూ డివిజన్లపై అభివృద్ధి విషయంలో వివక్ష చూపేవని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ప్రభుత్వాలు నిధులను సొంత అభివృద్ధికే కేటాయించుకున్నారని ఆరోపించారు.