జమిలి ఎన్నికలకే మొగ్గు చూపిన లా కమీషన్

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పక్షాలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన లా కమిషన్ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపింది. కేంద్ర న్యాయశాఖకు గుసమర్పించిన ముసాయిదా నివేదికలో ప్రధాన మంత్రి నరేంద్ర  మోదీ కొంతకాలంగా చెబుతున్న `ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ విధానానికి  లా కమిషన్ మద్దతు పలికింది. ఇందుకు మూడు ప్రత్యామ్నాయాలను కూడా సూచించింది.

జమిలి ఎన్నికలపై జనబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ నెల 31తో ప్రస్తుత లా కమిషన్ మూడేండ్ల పదవీకాలం ముగియనుండగా, అంతకు ఒక్కరోజు ముందు గురువారం 164 పేజీల ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. లోక్‌సభకు, జమ్ముకశ్మీర్ మినహా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది.

‘‘జమిలి ఎన్నికలతో ప్రజాధనాన్ని పొదుపు చేయొచ్చు. పరిపాలనా యంత్రాంగం, భద్రతా బలగాలపై భారం తగ్గించొచ్చు. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుపర్చవచ్చు. ‘జమిలి’ జరిగితే.. పరిపాలనా యంత్రాంగం ఎన్నికల ప్రక్రియపై కాకుండా.. నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు’’ అని నివేదికలో కమిషన్‌ పేర్కొంది.

అయితే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యంకావని,  ఆర్టికల్ 172 సహా పలు అధికరణలను సవరించాల్సి ఉంటుందని లా కమిషన్ స్పష్టంచేసింది. జమిలిపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగాలని అభిప్రాయపడింది. ఆచరణాత్మక విధానం రాజ్యాంగ, ప్రజా స్వామ్య సమాఖ్య వ్యవస్థకు కలిగే ఇబ్బందులు, హంగ్ ఏర్పడితే వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలను ప్రజల ముందు చర్చకు పెట్టింది.

జమిలి ఎన్నికలకు సంబంధించి లా కమిషన్ మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది :


-2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు 12 రాష్ర్టాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగేలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభతోపాటే గడువు ముగియనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.. ఈ ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుప వచ్చు.

ఎన్నికలు తర్వాత జరుగాల్సిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైనపక్షంలో ముందుకు జరిపి సర్దుబాటు చేసి వీటితోపాటే ఎన్నికలు నిర్వహించేలా సర్దుబాటు చేయవచ్చు. ఇక ఈ ఏడాది చివరలో జరుగాల్సిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ర్టాల ఎన్నికలను ఆరునెలలు పొడిగించి లోక్‌సభతోపాటే నిర్వహించాల్సి ఉంటుంది.

ఇవికాకుండా మిగిలిన 16 రాష్ర్టాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు 2019లో లోక్‌సభతోపాటే ఎన్నికలు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణలు సాధ్యమైన పక్షంలో 2024లో మాత్రం అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభతోపాటే ఒకేసారి ఎన్నికలు జరుపవచ్చు.

-2019లో లోక్‌సభతోపాటు 12 రాష్ర్టాలు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి 2021లో మిగిలిన 16 రాష్టాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు జరుపవచ్చు. ఈ అసెంబ్లీలను పూర్తికాలం కొనసాగిస్తూ ప్రతి ఐదేండ్లకోసారి రెండు పర్యాయాలుగా జమిలి ఎన్నికలు నిర్వహించటానికి అవకాశం ఉంటుంది.  ఈ ప్రత్యామ్నాయాలు సాధ్యంకాని పక్షంలో చివరి మార్గంగా ఒక ఏడాదిలో జరుగాల్సిన ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించవచ్చు.