వ్యోమగాములను తీసుకెళ్లేందుకు సిద్ధమైన స్పేస్ ఎక్స్

ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లనున్నది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సేవల సంస్థ స్పేస్ ఎక్స్ మార్చి 2వ తేదీన ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు చేరవేయనున్నది. ఈ సంస్థ 2012 నుంచి రొబోటిక్ డ్రాగన్ కార్గో షిప్ సాయంతో ఐఎస్‌ఎస్‌కు సరుకులు రవాణా చేస్తున్నది. దీనికి అడ్వాన్స్‌డ్ వెర్షన్‌గా అభివృద్ధి చేసిన క్రూ డ్రాగన్ క్యాఅంతరిక్ష వాహకనౌక అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకుపోనున్నది.

 ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకుపోనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2:48 గంటలకు ప్రయోగం జరుగనుంది. అమెరికాకు చెందిన వ్యోమగాములు డౌగ్ హార్లీ, బాబ్ బెన్‌కెన్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరికి ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఒకవేళ మార్చి 2న ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయోగం నిలిచిపోతే మార్చి 5న లేదా 8న లేదా 9న నిర్వహించనున్నారు. 

అనేక దేశాలు సొంతగా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా, ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా పెరుగుతున్నా మానవ సహిత యాత్రల పరిజ్ఞానం మాత్రం కొన్ని దేశాలకే పరిమితమైంది. క్రమంగా స్పేస్ మార్కెట్ లీడర్‌గా అవతరిస్తున్న మన దేశం వద్ద కూడా ఈ పరిజ్ఞానం లేదు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 

1961లో మొట్టమొదటిసారిగా యూరీ గగారిన్ అంతరిక్ష యానం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అమెరికా 2011 నుంచి మానవ సహిత అంతరిక్షయాత్రలకు స్వస్తి పలికింది. అప్పటి నుంచి అమెరికా తన వ్యోమగాములను రష్యాకు చెందిన సోయాజ్ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నది. ఇందుకు ఒక్కొక్కరికి రూ.500 కోట్ల వరకు (82 మిలియన్ డాలర్లు) చెల్లిస్తున్నది. ఈ నేపథ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ నాసాకు ఆశాకిరణగా కనిపిస్తున్నది. 

క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా ఒకేసారి ఏడుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చు. స్పేస్ ఎక్స్ 2014లో నాసా సహకారంతో క్రూ డ్రాగన్ తయారీ ప్రారంభించింది. దాదాపు రూ.18,469 కోట్లు (2.6 బిలియన్ డాలర్లు) వెచ్చించింది. క్యాప్సూల్‌ను ఒకేసారి వాడి పడేయకుండా పునర్వినియోగించేలా రూపొందించారు. ఈ క్యాప్సూల్ తన జీవిత కాలంలో కనీసం 10 సార్లు అంతరిక్షంలోకి వెళ్లివస్తుందని సంస్థ తెలిపింది. క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రం వరకు వెళ్లి తిరిగి సురక్షితంగా భూమిని చేరేందుకు ఎనిమిది ఇంజిన్లు అమర్చారు. హెలికాప్టర్ మాదిరిగా నిటారుగా పైకి ఎగురగలదు.. కిందికి దిగగలదు.