కుల్గాంలో డీఎస్పీ, ముగ్గురు ఉగ్రవాదులు మృతి‌

 


జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తరిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులలో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు జిల్లాలో నేతృత్వం వహిస్తున్న డిఎస్పీ అమన్ కుమార్ ఠాకూర్ , మరో జవాన్ మృతి చెందారు. 

సీఆర్‌పీఎఫ్‌, ఆర్‌ఆర్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో డీఎస్పీ అమన్‌ కుమార్‌ ఠాకూర్‌, సహా ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. అమన్‌ ఠాకూర్‌ 2011 బ్యాచ్‌కు చెందిన కశ్మీర్‌ పోలీస్‌ సర్వీస్‌ (కేపీఎస్)‌ ఆఫీసర్‌. ఏడాదిన్నరగా ఆయన కుల్గాంలో ఉగ్రవాద వ్యతిరేక పోలీసు విభాగానికి ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.