మళ్లీ గెలుపుపై `మన్‌ కీ బాత్‌’ లో ప్రధాని భరోసా

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పుల్వామా ఆత్మాహుతి దాడిని ఖండించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆయన ప్రస్తుత పదవీకాలంలో చివరి సారిగా ప్రసంగించారు. ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి రెండు నెలలపాటు విరామం ఇస్తున్నట్లు ప్రకటిస్తూ, ఎన్నికల తర్వాత మే చివరిలో మళ్ళి కలుద్దామని చెప్పడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రాగలమనే భయోరసాను వ్యక్తం చేశారు. 

ఇందులో భాగంగా ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. దీంతో పాటు మరి కొన్ని అంశాల గురించి మోదీ మాట్లాడారు.

"ప్రజల ఆశీస్సులతో మళ్లీ మే నెలలో మీ అందరితో వచ్చి ఇలా మాట్లాడుతాను. త్వరలో ఎన్నికలు ఉండటంతో మీ ముందుకు రాలేను. ప్రజాస్వామ్య విలువలు కాపాడటం నా బాధ్యత. అందుకే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించకూడదు" అని చెప్పారు. 

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని చెబుతూ మన దేశానికి సేవ చేస్తున్న జవాన్లకు ఎంతో రుణ పడి ఉన్నామని పేర్కొన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. 

 ఫిబ్రవరి 29న మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ జయంతి సందర్భంగా ఆయనకు జోహార్లు ఆరోపిస్తూ ప్రతి నాలుగేళ్లకోసారి మాత్రమే ఆయన జయంతిని జరుపుకోగలుగుతున్నామని చెప్పారు. రాజ్యాంగంలో ఆయన 44వ సవరణను తీసుకు వచ్చారని గుర్తు చేస్తూ  ఆయన దేశానికి చేసిన సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. 

మార్చి 3న బిర్సా ముండా, జంషేడ్‌ టాటా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారిని స్మరించుకున్నారు. ‘బిర్సా ముండా త్యాగాలు, బలిదానాన్ని మరువలేం. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు ఆయన. దేశం కోసం 25 ఏళ్ల వయసులోనే బిర్సాముండా బలిదానం అయ్యారు' అని నివాళులు ఆరోపించారు. 

ఇక టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, టాటా స్టీల్‌ వంటి ఎన్నో సంస్థలను జంషేడ్‌ టాటా నెలకొల్పారని గుర్తు చేసుకున్నారు. అప్పటి టాటా సైన్సెస్‌ సంస్థ ఇప్పుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్సెస్‌గా మారిందని చెప్పారు. 

ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం విశేష కృషి చేస్తోందని పేర్కొంటూ దేశంలోని యువత అందరూ ఓటేయడానికి ముందుకు రావాలని పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు వేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.