రైతుకు ఆర్ధిక దన్ను చేకూర్చే పిఎమ్-కిసాన్ నేడే


దేశ వ్యాప్తంగా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో  రూ 75వేల కోట్ల  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్)పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని గోరఖపూర్ లో ప్రారంభిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రూ 2,000లను బదిలి చేస్తారు. మరో  రెండు హెక్టార్ల వరకూ వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన 12కోట్ల మంది రైతులకు మూడు విడతలుగా ఏటా రూ 6,000లను అందించే పీఎమ్-కిసాన్ పథకాన్ని ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

 ‘దేశ చరిత్రలో ఆదివారం ఓ చారిత్రక దినం కాబోతోంది. గోరఖ్‌పూర్ నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం కాబోతోంది. మన దేశానికి అన్నం పెడుతున్న కోట్లాది మంది రైతుల ఆకాంక్షలకు ఈ పథకం ఉద్దీపన’అని మోదీ ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికే కాకుండా త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వానికి సాటిలేదన్న విషయాన్ని ఈ పథకం స్పష్టం చేస్తోందని చెప్పారు. ఫిబ్రవరి ఒకటిన ప్రకటించిన ఈ పథకం అతి తక్కువ వ్యవధిలోనే అమలు కాబోతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

దేశంలోనే సరికొత్త పని సంస్కృతికి ఇది సంకేతమని ప్రధాని తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్చిలోగానే 12 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ 2,000 జమచేయాలని నిర్ణయించింది. వివిధ సందర్భాల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తీర్చే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. ఆదివారం ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలతో సహా మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన కోటి మందికి పైగా రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

ఓ కేంద్ర పాలిత ప్రాంతం, 28 రాష్ట్రాలకు చెందిన రైతులకు రెండు మూడు రోజుల్లో మొదటి విడత 2వేల రూపాయలను అందిస్తామన్నారు. ఓ ఏడాది కాలంలో నిర్దేశిత 6వేల రూపాయలను మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తామన్నారు.