ఉగ్రవాదం అంతమైతేనే ప్రపంచ శాంతి

ఉగ్రవాదం అంతమైతేనే ప్రపంచ శాంతి ఏర్పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసారు. ఉగ్రవాదం కోరల్లో చిక్కుకోని దేశమంటూ ప్రపంచంలో ఏదీలేదని అంటూ బిమ్స్‌టెక్ దేశాలతో కలిసి భారత్ ఉగ్రవాదం, డ్రగ్స్ ట్రాఫికింగ్‌పై పోరాడుతుందని రెండు రోజుల బిమ్స్‌టెక్ (బెంగాల్ తీర దేశాల బహుళ విభాగ సాంకేతిక,ఆర్థిక సహకార అంకురార్పణ)సదస్సులో ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు. బిమ్స్‌టెక్ దేశాలు తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి దూరంగా ఉండాలని మోడీ స్పష్టం చేసారు.

ప్రపంచ జనాభాలో 22 శాతం బిమ్స్‌టెక్ దేశాల్లోనే ఉన్నారు. బిమ్స్‌టెక్ దేశాలు 7. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలకం, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ ఇందులో సభ్యదేశాలు.  శాంతి, సహకారం వెల్లివిరిసినప్పుడే  సభ్యదేశాల మధ్య ఆర్థిక ప్రగతి తేజోవంతమవుతుందని నాల్గోవ బిమ్స్‌టెక్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సభ్యదేశాల్లో ఉగ్రవాదం బారిన పడని దేశమంటూ లేదని అంటూ దాన్ని ఆరికట్టడానికి అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడాలని కోరారు. నార్కొటిక్ సంబంధిత అంశాలపై సమావేశాన్ని నిర్వహించటానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు.

బిమ్స్‌టెక్ దేశాలతో భారత్ కేవలం దౌత్య సంబంధాలనే కాకుండా  నాగరికత, చరిత్ర,కళ, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, భాష, వంటకాలతోధృడమైన వారసత్వ సంస్కృతిని కలిగి ఉందని ప్రధాని గుర్తు చేసారు. ప్రపంచ వాతావరణ స్థితిగతులను మెరుగుపరిచే విధంగా బిమ్స్‌టెక్ దేశాలు ఇతర దేశాలపై ఒత్తిడి తేవాలని సూచించారు. బిమ్స్‌టెక్ దేశాల మధ్య సాంకేతిక మాధ్యమాల వ్యాప్తి బలపడాలని అంటూ సభ్యదేశాల అభివృద్ధికి భారత్ పెద్దపీట వేస్తుందని మోడీ భరోసా ఇచ్చారు. 

ఇందులో భాగంగానే డిజిటల్ కనెక్టివ్‌ని శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వ్యాప్తి చేసేందుకు భారత్ కృషి చేస్తున్నదని చేపప్రు. భారత ప్రధానికిది తొలి బిమ్స్‌టెక్ సదస్సు. 2016లో గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో బిమ్స్‌టెక్ అవసరాన్ని గుర్తించినట్లు మోడీ చెప్పారు. బిమ్స్‌టెక్  దేశాలు కలసిమెలసి పనిచేసి సభ్యదేశాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. హిమచల పర్వత శ్రేణులు, సుందర బంగాళాఖాతం సభ్య దేశాల వికాసం, ప్రగతిలో వారధులని గుర్తుచేసారు మోడీ. సభ్యదేశాల అభివృద్ధి భారత్‌కు ఎంతో ముఖ్యం అని అంటూ  సోదరభావం భారత్ సంస్కృతిలోనే ఉందని, ఎదుటివారిని గౌరవించే సంప్రదాయం భారత కుటుంబంలో అనాది నుంచి వస్తున్నదేనని స్పష్టం చేయరు.

మనమందరం కూడా ప్రగతి, వికాసం కోసం కలసి పనిచేసే సదావకాశం బిమ్స్‌టెక్ రూపంలో దొరికినందుకు సంతోషపడాలని చెప్పారు. శాంతి,సమృద్ధి కోసం అందరం ఏకతాటిపైకి రావాలని అంటూ అన్ని దేశాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వాణిజ్యం, సాంకేతికం, రవాణాతో పాటూ మనుషుల మధ్య పరస్పర సంబంధాలు బలపడాలని,  అప్పుడే పొరుగుదేశాలన్ని అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తాయని పేర్కొన్నారు.

బిమ్స్‌టెక్ దేశాల్లో  బౌద్ధ ధర్మం చాలా కీలకమైందని చెబుతూ దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆగష్టు 2020లో భారత్, అంతర్జాతీయ బుద్ధ సమావేశాన్ని నిర్వహించనున్నదని వెల్లడించారు. దేశంలో ఉన్న యువతను మరింత మెరుగుపరిచేలా సాంకేతిక సమావేశాల సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా అందని అంటూ బిమ్స్‌టెక్ యూత్‌ఫెస్టివల్  అవసరాన్ని గుర్తుచేసారు. అంతేకాదు త్వరలో బిమ్స్‌టెక్ యూత్ వాటర్ స్పోర్ట్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

బిమ్స్‌టెక్ దేశాల కోసం 30 రిసెర్చ్ స్కాలర్‌షిప్‌లను నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడుతున్నామని ప్రధాని ప్రకటించారు. మెరుగైన వైద్య విద్య  కోసం షార్ట్ టెర్మ్ కోర్సులను నలందలో ఏర్పాటు చేయనుని తెలిపారు. పర్యాటకం, పర్యావరణం, ఇండస్ట్రీయల్ మేనేజ్‌మెంట్,వాణిజ్యం, రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయం, అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా షార్ట్ టెర్మ్ శిక్షణా తరగతులను ప్రవేశపెట్టనున్నారు.

బెంగాల్ పరివాహక ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, భాషలు, ఆహారపు అలవాట్లను తెలుసుకోవటానికి నలందలో సెంటర్ ఫర్ బే ఆఫ్ బెంగాల్ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టనున్నట్లు భారత ప్రధాని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో అన్ని దేశాల భాషలు, ఇతిహాసాలను నేర్చుకోవటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.