ప్రధానిని ఏపీ దోషిగా నిలబెట్టడమా !

 ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై ప్రజలకు తెలియకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవ విరుద్ధంగా బీజేపీపైనా, ప్రధానిపైనా విమర్శలు చేస్తున్నారని  మండిపడ్డారు. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ, ప్రధాన మంత్రి మోదీపై ఆరోపణలు చేయడం సరికాదని ఢిల్లీలో మాట్లాడుతూ హితవు చెప్పారు. 

హైదరాబాద్‌లో ఓటుకునోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదిలేసుకోని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాల పేరుతో ఈ ఐదేళ్లు గడిపి, కేంద్ర సహాయం చేయడం లేదని మోదీపై విమర్శలు చేయడం ఎంత వరకూ సబబని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 

ముఖ్యంగా ఏపీలోని వౌలిక సాదుపాయాల ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి భారీ ఎత్తున అవినీతికి పాల్డడ్డారని కన్నా ఆరోపించారు. కేంద్రం నిర్మాణం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కాంట్రాక్టు పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ పరిశీలన చేయాలని మాత్రమే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టిందని గుర్తు చేశారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రాష్ట్రానికి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని అంటూ ఎందుకు చట్టంలో పెట్టలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేకపోవాడం వల్లన ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని కన్నా విమర్శించారు. విభజన సమయంలో వీరప్ప మొయిలీ అడ్డుకోవడం వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో కలిసి తెలుగుదేశం పని చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంట్‌లో కోరింది ఒక్క బీజేపీ పార్టీనేనని ఆయన గుర్తు చేశారు. 

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సుకు కనీస సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. దుగరాజుపట్నం పోర్టు ఏర్పాటు సాంకేతికంగా సాధ్యం కాదని, రాష్ట్రంలో వేరేచోట పోర్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని కన్నా తెలిపారు.