ఆర్టికల్‌ 35 ఎ పై సుప్రీం కోర్ట్ లో సోమవారం వాదనలు

రాజ్యాంగంలో జమ్ముకశ్మీర్‌కు విశేషాధికారాలు అందజేస్తున్న వివాదాస్పదమైన ఆర్టికల్‌ 35 ఎ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా పరిస్థితులు మరింత విషమించకుండా చూసేందుకు భద్రతాదళాలు కశ్మీరీ వేర్పాటువాదనేతలను అదుపులోకి తీసుకున్నాయి.

ఆర్టికల్‌ 35 ఎ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సోమవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్టికల్‌ 370, 35ఎ చట్టబద్ధతపై విచారణ అనంతరం రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదాను కల్పిస్తోంది. జమ్ముకశ్మీర్‌ దేశంలో విలీనమయ్యే సమయంలో అప్పట్లో ఆ రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు వీలుగా  370 ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్‌ రంగాలు తప్ప ఇతర రంగాలపై కేంద్రానికి అధికారం ఉండదు. పార్లమెంటు చట్టాలు చేసినా ఆ రాష్ట్రఅసెంబ్లీ మరో సారి వాటికి ఆమోదం తెలపాల్సివుంటుంది.

జమ్ముకశ్మీర్‌ భారత్‌లో చేరిన అనంతరం ఇతరులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రజలు డిమాండ్‌ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రప్రభుత్వం 1954లో ఆర్టికల్‌ 35 ఎ ను రాజ్యాంగంలో చేర్చింది. ఈ ఆర్టికల్‌ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వతపౌరులన్నది జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. 

ప్రభుత్వరంగంలోని  ఉద్యోగాలు, భూముల కొనుగోలు, ఉపకారవేతనాలు, సంక్షేమం..తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలు ఉన్నాయి. దీని కింద చేసిన నిర్ణయాలను సవాల్‌ చేసే అవకాశం లేదు.వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్‌కు అనుబంధాన్ని చేర్చే సమయంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. అయితే దీనికి భిన్నంగా మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పదవీకాలంలో రాష్ట్రపతి  ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 

దీంతో అప్పటి నుంచి ఈ ఆర్టికల్‌పై వివాదం రగులుతూనే ఉంది.   పార్లమెంటు ఆమోదం లేకుండా ఆర్టికల్‌ను చేర్చడంపై కొన్నిఎన్జీవోలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. వీటి వాదన ప్రకారం ఆర్టికల్‌ 370 కేవలం తాత్కాలికమేనని దీని ద్వారా మరిన్ని ఆర్టికల్స్‌ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశాయి.  కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఇవ్వడం రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్‌ ప్రకారం వ్యతిరేకమేనని ఎన్జీవోలు పేర్కొంటున్నాయి.

ఈ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాలకు చెందినవారిని వివాహం చేసుకుంటే ఆ దంపతులకు పుట్టే పిల్లలకు రాష్ట్రంలో ఆస్తిహక్కు ఉండదు. రాష్ట్రంలో శాశ్వత నివాస హక్కును ఆ పిల్లలకు జారీచేయరు. 

1957లో వేలాదిమంది దళితులను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు వృత్తుల కోసం తీసుకువచ్చారు.వీరికి నివాస హక్కును ఇచ్చారు. వీరి పిల్లలు వేరేవృత్తులకు వెళితే నివసించే హక్కును కోల్పోతారు. రాజ్యాంగంలోని పలు మౌలిక, ప్రాథమికసూత్రాలకు ఆర్టికల్‌ 35 ఎ వ్యతిరేకంగా ఉండటంపై మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.