కశ్మీరీల లక్ష్యంగా దాడులను ఖండించిన ప్రధాని

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కశ్మీరీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. కశ్మీరీల రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మన పోరాటం ఉగ్రవాదంపైనేనని, కశ్మీరీలపై కాదని ఆయన హితవు చెప్పారు. 

పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడిన ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సైనిక బలగాలపై పూర్తి విశ్వాసం ఉంచాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని పాల్గొంటూ  ఉగ్రవాదానికి కశ్మీర్ యువత బలైపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీరీలు ఉగ్రవాదం నుంచి బయటపడాలని కోరుకుంటున్నా. ఉగ్రవాదంపై పోరాడేందుకు కశ్మీరీ యువతను మనం తయారుచేయాలి. వారి సంరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. 

 కొన్ని చోట్ల కశ్మీర్ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడాన్ని ప్రధాని మోదీ ఆక్షేపించారు.ఉగ్రవాదంపై భారత దేశం చేస్తున్న పోరాటంలో ప్రతి కశ్మీరు బిడ్డ అండగా ఉన్నట్లు తెలిపారు.  కశ్మీరు బిడ్డను కాపాడే బాధ్యత, కర్తవ్యం తనకు ఉన్నట్లు తెలిపారు. కశ్మీరీలపై దాడులు జరగకూడదని, అటువంటి సంఘటనలు దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారికి ఊతమిస్తాయని హెచ్చరించారు. కశ్మీరు బిడ్డలను రక్షించవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపైనా ఉందని చెప్పారు. 

కశ్మీరీయులను, అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులను కాపాడుకోవడం ఎలాగో కేంద్రానికి తెలుసునని అన్నారు. 

కాగా, ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు నిరంతరం పనిచేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతి ఎలా సాధ్యమని ప్రధాని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌లో జీవిస్తూ పాకిస్థాన్‌కు వంత పాడుతూ, యువతను రెచ్చగొడుతున్న కశ్మీర్ వేర్పాటువాదులపై కఠినచర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు. విద్రోహ చర్యలను సహించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. 

పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ బాధ్యతలు చేపట్టినప్పుడు శుభాకాంక్షలు తెలిపేందుకు తాను ఫోన్ చేసిన సంగతిని సభలో మోదీ వివరించారు. ఇప్పటివరకూ భారత్, పాక్ ఎన్నో యుద్ధాలు చేశాయి. కానీ, పాక్ సాధించిందేమీ లేదు. ప్రతి యుద్ధంలోనూ భారతే గెలిచింది. ఇప్పుడు మనం పేదరికం, నిరక్షరాస్యతలపై యుద్ధం చేద్దాం అని చెప్పా. ఇందుకు ఇమ్రాన్ సానుకూలంగా స్పందించాడు. తన మాటలకు ఇమ్రాన్ కట్టుబడి ఉంటారో? లేదో? చూద్దాం అని మోదీ పేర్కొన్నారు.