కాశ్మీర్ లో వేర్పాటు వాదులపై ఉక్కుపాదం !

జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 35ఏ రాజ్యాంగ అధికరణం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ జరుగనున్న నేపథ్యంలో జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వేర్పాటువాద సంస్థల నేతలు, కార్యకర్తలను పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు భారీగా అదుపులోకి తీసుకున్నాయి. 

జేకేఎల్‌ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్, జమాత్ ఏ ఇస్లామీ అధినేత డాక్టర్ అబ్దుల్ హమీద్‌ఫయాజ్, అధికార ప్రతినిధి జహీద్ అలీతోపాటు సుమారు 150 మంది జమాత్ కార్యకర్తలను, తెహ్రీక్ ఏ హురియత్ తదితర సంస్థల శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితంగా కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆగమేఘాలపై జమ్ముకశ్మీర్‌కు 100 కంపెనీల (సుమారు 10 వేల మంది) పారా మిలిటరీ బలగాలను పంపుతూ కేంద్ర హోంశాఖ  ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు 45 సీఆర్పీఎఫ్, 35 బీఎస్‌ఎఫ్, 10 ఎస్సెస్బీ, 10 ఐటీబీపీ కంపెనీల బలగాలను శుక్రవారం రాత్రే గగనతలం మీదుగా శ్రీనగర్‌కు పంపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు వారు కశ్మీర్‌లోయలోనే విధులు నిర్వర్తించాలని పేర్కొన్నది. 

35ఏ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు విచారణ, త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే బలగాలను భారీ ఎత్తున మోహరించినట్లు తెలుస్తున్నది. ఒకవైపు అరెస్టులు జరుగుతుండగా, మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంట వరకు జమ్ముకశ్మీర్ గగనతలంపై సైనిక విమానాలు చక్కర్లు కొట్టాయి. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆదివారం రాష్ట్ర బంద్‌కు వేర్పాటు వాద సంస్థల కూటమి జాయింట్ రెసిస్టెన్స్ లీడర్స్ (జేఆర్‌ఎల్) పిలుపునిచ్చింది. 

పోలీసులు భారీగా వేర్పాటు వాద సంస్థల నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడంతో కశ్మీర్ అంతటా ఉద్రిక్తతలకు దారితీసింది. రోజువారీ విధుల నిర్వహణలో భాగంగా వీరిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నా.. జమాత్-ఏ-ఇస్లామీ శ్రేణులను భారీగా అరెస్ట్ చేయడం ఇదే తొలిసారని అధికారులు అనధికారికంగా అంగీకరించారు. 

35ఏవ రాజ్యాంగ అధికరణంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కశ్మీర్ లోయలో విధ్వంసానికి కుట్రలు జరుగుతున్నాయంటూ తమకు సమాచారం అందిందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనంత్‌నాగ్, పహల్‌గామ్, డయాల్గామ్, ట్రాల్ తదితర ప్రాంతాల జమాత్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రమంతటా పటిష్ఠ భద్రతాఏర్పాట్లు చేశారు. 

మరోవైపు శనివారం లోగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు రేషన్ సరుకులు సరఫరా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కశ్మీరీలు శనివారం పెట్రోల్ బంకులు, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద భారీగా బారులు తీరారు. 

రాష్ట్రంలో సజావుగా లోక్‌సభ ఎన్నికలను నిర్వహించడానికి భారీగా బలగాలను మోహరించామని అధికార వర్గాలు తెలిపాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా కేవలం 12 వేల మంది బలగాలతో పాకిస్థాన్‌తో యుద్ధానికి వెళ్లలేమని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికే భారీగా బలగాలను మోహరించామన్నారు.

 కాగా, రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చేనెల 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటించనున్నది. మరోవైపు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు.