తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ గల్లంతు

 తెలంగాణ శాసనమండలిలో ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ నెల నుంచి గల్లంతు కానున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాలను నిలుపుకొనే అవకాశాలులేవు.

 ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా ఒక ఎమ్మెల్సీ సీటు గెల్చుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం అవసరం. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కూటమికట్టి రెండు స్థానాలు గెలుపొందిన టీడీపీ మీద కాంగ్రెస్ పార్టీ ఆశలుపెట్టుకున్నది. కానీ టీడీపీ సభ్యులు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రశ్నేలేదని చెప్తున్నారు. వారిలో ఒక సభ్యుడు మంత్రి పదవి ఆశిస్తూ అధికార పార్టీ వైపు చూస్తున్నారు. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందేందుకు కావాల్సిన సంఖ్యా బలం లేకపోయిన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు బరిలో నిలుస్తామని చెప్తున్నారు. అయితే వీరికి ఓటింగ్ సమయంలో రెండో ప్రాధాన్యం ఓట్లు లభించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రెండో ప్రాధాన్యం ఓట్లను అధికార పార్టీ సభ్యులుగానీ, వారికి మద్దతిచ్చే ఇతర పార్టీలుగానీ కాంగ్రెస్‌కు ఎలా వేస్తారు? 

అసెంబ్లీలో అధికార టీఆర్‌ఎస్‌కు 88 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు పార్టీలో చేరారు. వీరితో కలుపుకుంటే టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 90కి చేరింది. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతోపాటు ఎంఐఎంకు చెందిన ఏడుగురు సభ్యు లు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారు. ఇక మిగిలిం ది బీజేపీకి చెందిన ఒక సభ్యుడు మాత్రమే. ఇప్పటివరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు.

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు మండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా కోరారు. వారిని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనంచేశారు. దీంతో మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం ఇద్దరికి పడిపోయింది.