బీజేపీకి సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

బిజెపి  సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి (73) కన్నుమూశారు. హైదరాబాద్ లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకుని బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. 

ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాల్‌రెడ్డి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 

హైదరాబాద్‌కుబీజేపీలో సాధారణ స్థాయి నుంచి రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగిన బద్దం బాల్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 వరకు కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున ఆయన పోటీ చేసి పరాజయం 

ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని తన స్వగృహంలో ఉంచనున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యకర్తల కడచూపు కోసం బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు బాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఉంచుతారు. బీజేపీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం మహాప్రస్థానంలో బాల్ రెడ్డి అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు.   

మాజీ కేంద్ర మంత్రి ఏ నరేంద్రతో పాటు హైదరాబాద్ నగరంలో బిజెపి కార్యకర్తలకు భరోసా కలిగించే విధంగా వ్యవహరించి పార్టీ బలోపేతం కావడానికి విశేషంగా కృషి చేశారు. పలు ప్రజా ఆందోళనలకు నేతృత్వం వహించారు. 

పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్‌రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్‌గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్‌సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు. బీజేపీకి రాష్ట్ర శాఖలో కీలక పదవులు అధిష్టించారు. 

అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకులు బద్దం బాల్‌రెడ్డి ఒకరు. 2004లో ఐ ఎస్ ఐ ఎస్ ద్వారా శిక్షణ పొందిన ఒక బృందం ఆయనపై దాడికి ప్రయత్నం చేసింది. 

ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.   ప్రజా జీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలను సీఎం ఈసందర్భంగా కొనియాడారు.