కుంభమేళా కూడా సామాజిక సంస్కరణే: మోదీ

 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా-2019ని ఒక సామాజిక సంస్కరణతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. కుంభమేళాలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, భారతదేశం సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. 

ఆధ్యాత్మిక స్ఫూర్తితో పాటు సామాజిక సంస్కరణ కూడా మిళితం కావడమే కుంభమేళా ప్రత్యేకత అని పేర్కొన్నారు. రోజువారీ యాంత్రిక జీవనంతో అసలిపోయే వారికి కుంభమేళాలో మానసిక ప్రశాంతత, ఉల్లాసం దొరుకుతుందని తెలిపారు. అది మన జీవితాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుందని ప్రధాని ప్రకటించారు.

'కుంభమేళాను దర్శించకుండా అదెంత పెద్ద సాంస్కృతిక వారసత్వ సంపదో తెలుసుకోవడం కష్టం. వేలాది సంవత్సరాలుగా నిర్దిష్ట కాలపరిమితిలో ఈ కుంభమేళా జరుగుతోంది. ప్రతిసారి ఎలాంటి ఆహ్వానం లేకుండా ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు' అని మోదీ వివరించారు. 

కుంభమేళాకు మరింత గుర్తింపు తీసుకు వచ్చేందుకు తరలివచ్చిన వివిధ దేశాలు ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ వారసత్వ ప్రతీక అయిన కుంభమేళాతో ప్రపంచదేశాలు కూడా మమేకం కావాలన్నదే తమ అభిమతమని ఆయన తెలిపారు. భారతదేశ సంస్కృతి ప్రపంచ దేశాలను అయిస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉందని మోదీ వివరించారు.

కాగా, ప్రధాని ఆదివారం ప్రయోగరాజ్ సందర్శించి కుంభమేళలో పాల్గొననున్నారు.