రైల్వే జోన్ పై ప్రధాని విశాఖలో ప్రకటన


విభజన హామీలలో ఒకటైన విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసే హామీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మర్చి 1న విశాఖపట్నంలో జరిగే బిజెపి బహిరంగ సభలో ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ప్రధానితో ప్రకటన చేసేందుకు రాష్త్ర బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

బిజెపికి చెందిన విశాఖపట్నం ఎంపీ కె హరిబాబు సహితం తన పదవీకాలం ముగిసే లోగా రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ విషయమై ఏపీకి చెందిన బిజెపి ముఖ్యనాయకులు శనివారం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పీయూష్ గోయల్ సహితం ఆంధ్ర ప్రదేశ్ నుండే రాజ్యసభకు ఎన్నిక కావడం గమనార్హం. 

ఏపీకి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని ఈ సమావేశం అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేసారు. ఢిల్లీలో రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. 

రైల్వే జోన్‌ ఆవశ్యకతను పీయూష్‌ గోయల్‌కు వివరించామని కన్నా చెప్పారు. 2014 నుంచి కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తోందని,  అయినా చంద్రబాబు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని, విభజన హామీలను కేంద్రం 90 శాతం అమలు చేసిందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం అడ్డుపడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇస్తోందని వెల్లడించారు. 

విశాఖ ఎంపీ హరిబాబు నేతృత్వంలో రైల్వే జోన్‌ సాధిస్తామని గతంలోనే మీడియాకు చెప్పానని కన్నా గుర్తు చేశారు. రైల్వే జోన్‌పై త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడించారు.దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, జీవీఎల్‌ నరసింహరావు, ఎమ్మెల్సీ మాధవ్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు ప్రధాని, పీయూష్‌ గోయల్‌ను కలిసిన వారిలో ఉన్నారు.