ప్రపంచం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలి

 ప్రపంచం ఐకమత్యంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్య తీసుకొని తీరాలని, ఇందుకు సమయం ఆసన్నమయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిల్పుపిచ్చారు. ప్రపంచ శాంతికి, భద్రతకు.. తీవ్రవాదం, ఉగ్రవాదంల నుంచి అతి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టు తాను గుర్తించానని పేర్కొన్నారు. ప్రపంచ సమాజం ఐకమత్యంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటికి ఆర్థిక వనరులను అందిస్తున్న మార్గాలను నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమయిందని ఆయన స్పష్టం చేశారు. 

రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయిన్‌తో చర్చలు జరిపిన అనంతరం మాట్లాడుతూ  జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఫిబ్రవరి 14న జరిపిన భయంకరమయిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత తమకు మద్దతుగా నిలిచిన దక్షిణ కొరియాకు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరో కార్యక్రమంలో మోదీ 2018వ సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరియా వలెనే భారత్ కూడా సీమాంతర కలహాల కారణంగా గాయపడిందని తెలిపారు. ‘శాంతియుత అభివృద్ధి దిశగా సాగుతున్న మా కృషి సీమాంతర ఉగ్రవాదం కారణంగా తరచుగా గాడితప్పుతోంది’ అని ఆయన పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

భారత్ గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలం నుంచి సీమాంతర ఉగ్రవాదం వల్ల బాధపడుతుండగా, నేడు అన్ని దేశాలు ఈ భయంకరమయిన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని ఆయన తెలిపారు. 

‘మానవత్వాన్ని విశ్వసిస్తున్న వారంతా చేయి చేయి కలిపి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వాటికి ఆర్థిక వనరులను అందిస్తున్న మార్గాలను సమూలంగా నిర్మూలించవలసిన సమయం ఆసన్నమయింది’ అని మోదీ అన్నారు. 

తీవ్రవాదం, ఉగ్రవాదం కూడా ప్రపంచీకరణ చెందాయని, వీటిని ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, బహుళపక్ష సహకారాన్ని పెంపొందిస్తామని తెలిపారు. ఉగ్రవాద సిద్ధాంతాన్ని, ప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందని ఆయన వెల్లడించారు. 

ప్రధాని పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. క్రీస్తుశకం 48వ సంవత్సరంలో కొరియా రాజు కిమ్‌ సురోను వివాహమాడిన అయోధ్య రాకుమారి సురి రత్న (మహారాణి హుర్‌ హ్వాంగ్‌ ఓక్‌)పై ఇరు దేశాలూ తపాలా బిళ్లను విడుదల చేయాలని నిర్ణయించాయి. 

పురస్కారం సొమ్ము.. గంగా ప్రక్షాళనకు 

అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక ప్రగతికి సహకరిస్తున్నందుకు ప్రధాని మోదీకి 2018వ సంవత్సరపు సియోల్‌ శాంతి పురస్కారాన్ని బహూకరించారు. ప్రధాని జీవితం, సాధించిన విజయాలపై చిత్రీకరించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఇది తనకు వ్యక్తిగతంగా లభించిన పురస్కారం కాదని, భారత ప్రజలకు ఇచ్చినదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బహూకరించిన రెండు లక్షల డాలర్లు (రూ.1.40కోట్లు)ను గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారు.