హామీల అమలే లక్ష్యంగా కేసీఆర్ ఓటాన్ ఆకౌంట్ బడ్జెట్

ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 2019 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతను కల్పించారు.

శాసనసభలో ప్రవేశపెట్టిన రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా...తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించేలా... బంగారు తెలంగాణ పథంలో ముందుకు సాగేలా ఉందని పేర్కొంటూ ఐదేళ్లుగా సాగునీటి రంగానికే అత్యధిక కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం ఆరో ఏట కూడా ఆ రంగానికి, సంక్షేమానికి... వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. బడ్జెట్‌లో దాదాపు సగం నిధులు వీటికే కేటాయించడం గమనార్హం. 

రైతులకు అమలు చేస్తున్న రైతుబంధు, రైతుల రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులతో పాటు వైద్య ఆర్యోగ శాఖ, కల్యాణ లక్ష్మి, నిరుద్యోగభృతి వంటి  పథకాలకు, భారీ కేటాయింపులు జరిపారు. రైతుబంధు పథకం, రైతు రుణమాఫీ పథకాలకు రూ 20వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ 25 వేల కోట్లు కేటాయింపులు జరిపి తమ  ప్రభుత్వం వ్యవసాయదారుల పక్షపాతి అని చెప్పుకున్నారు. 

రైతుబంధు పథకానికి రూ  12వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ 6 ల కోట్లు కేటాయించారు. రైతుల రుణమాఫీని 2018వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న రైతులందరికీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతుల రుణమాఫీని నాలుగు దఫాలుగా అమలు జరుపుతామని వెల్లడించారు. 

రైతుబంధు పథకానికి ఎకరానికి రూ 8,000 చెల్లిస్తున్న దానిని ఇక నుంచి రూ 10వేలకు పెంచుతామని గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఖరీఫ్, రబీ పంటలకు ముందు ఎకరానికి ఐదు వేల  రూపాయలు చొప్పున రైతుల ఖాతాల లోనికి నేరుగా జమ చేస్తామని తెలిపారు. 

ఒక వైపు ఉద్యోగాల భర్తీని కొనసాగిస్తూనే నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు సుమారు ఐదు లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున భృతి అందించేలా బడ్జెట్‌ను రూపొందించింది. నిరుద్యోగ భృతి అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. 40 లక్షలమంది ఆసరా పింఛనుదారులకు పింఛను మొత్తం రెట్టింపు చేసింది. గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ.5,366 కోట్లను కేటాయించగా ఈ సారి ఈ మొత్తాన్ని రూ.12,067 కోట్లకు పెంచింది.   

ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, నేత, గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలు నుంచి రూ 2016 కు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ 1500 నుంచి రూ 3016కు   పెంచటమే కాకుండా వృద్ధాప్య పెన్షన్ పొందటానికి ప్రస్తుతం ఉన్న 65 సంవత్సరాల వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.