దర్శకురాలు బి.జయ కన్నుమూత

తెలుగు సినీ దర్శకురాలు బి.జయ(54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.  పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయ తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం సూపర్‌ హిట్‌ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు.

ప్రముఖ సినీపాత్రికేయుడు, పీఆర్వో బి.ఎ.రాజు ఆమె భర్త. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ సినీ పాత్రికేయురాలిగా తన కెరీర్‌ ప్రారంభించారు.  దర్శకత్వం పట్ల ఆసక్తితో ఆ రంగంవైపు అడుగేశారు. 2003లో తొలిసారి చంటిగాడు సినిమాను దర్శకత్వం చేసి తనను తాను నిరూపించుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్లీ..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం.

జయ దర్శకత్వంలో ఐదు చిత్రాలు వచ్చాయి. ఆమె తీసిన ఆఖరు చిత్రం ‘వైశాఖం’ గత ఏడాది విడుదలైంది. కామ్నజెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను తెలుగు ప్రేక్షకులకు ఆమే తన చిత్రాల ద్వారా పరిచయం చేశారు.

ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. ఆమె స్వయంగా తన చిత్రాలను తానే ఎడిటింగ్‌ చేసుకుంటారు. తెలుగు సినీ రంగంలో తొలి మహిళా ఎడిటర్‌గానూ ఖ్యాతి గడించారు. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.