బీఎస్పీతో పొత్తుపై ములాయం అసహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దేని ప్రాతిపదికన రాష్ట్రంలోని సగం లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేయడంపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని తెలిపారు. 

రాష్ట్రంలో ఎస్పీ చాలా బలంగా ఉన్నదని, ఇలాంటి సమయంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.  ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించాక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. "మీకు అభ్యర్థుల ఎంపిక చాతకానీ పక్షంలో నాకు చెప్పండి. నేను ఎంపిక చేస్తాను" అంటూ కొడుకుకి చురకలు అంటించారు. గతంలో ఎనిమిది నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించే వాడినని గుర్తు చేశారు. 

యూపీ ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగా పనిచేసిన తాను పార్టీని ఎంతో బలోపేతం చేశానని, తన పాలనలో ఎస్పీ కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కానీ నేడు మన నాయకులే పార్టీని బలహీనపర్చుతున్నారని అంటూ పరోక్షంగా కుమారుడి ధోరణిపై ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 37 చోట్ల ఎస్పీ, 38 చోట్ల బీఎస్పీ పోటీ చేస్తున్నట్లు గురువారం రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు సీట్ల జాబితాను విడుదల చేశాయి.  తమ కన్నా ఒక్క సీట్ ఎక్కువగా పోటీ చేయడం ద్వారా మాయావతి ఆధిపత్య ధోరణి ప్రదర్శించినట్లు అవుతున్నదని ఎస్పీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.