గాంధీజీ బోధనలతోనే పరిష్కారం : మోదీ


ప్రపంచ మానవాళికి ఉగ్రవాదం, వాతావరణ మార్పు రెండు అతిపెద్ద సవాళ్లుగా పరిణమించాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీజీ జీవన శైలి, ఆయన బోధనలు ఈ సమస్యల పరిష్కారంలో ప్రపంచ దేశాలకు సహకరిస్తాయని చెప్పారు. దక్షిణ కొరియాతో వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం రెండు రోజుల పర్యటన కోసం సియోల్‌కు వచ్చిన మోదీ గురువారం ప్రతిష్ఠాత్మక యొన్‌సెయి యూనివర్సిటీ వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కొరియాలో పేరొందిన యూనివర్సిటీ వద్ద గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించడం గౌరవంగా ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రాముఖ్యం ఉన్నదని తెలిపారు. విలువలకు కట్టుబడి ఐక్యంగా ముందుకు సాగాలని గాంధీజీ బోధించారని తెలిపారు. అహింసా మార్గంలోనే ఉగ్రవాదాన్ని తుదముట్టించగలమని పేర్కొన్నారు.

భారత్ ఆర్థిక మూలాలు చాలా శక్తిమంతంగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. ఏయేటికాయేడు ఏడు శాతానికి పైగా ప్రగతి సాధిస్తున్న అతిపెద్ద దేశమే లేదని గుర్తు చేశారు.

భారత్-ఆర్వోకే బిజినెస్ సింపోజియంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దక్షిణ కొరియా ఇన్వెస్టర్లకు భారత్ అవకాశాల వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులు పెట్టిన హ్యుండాయ్, శామ్‌సంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సహా 600కి పైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. దక్షిణ కొరియా నుంచి మేం మరింత పెట్టుబడులు రావాలని ఆకాంక్షిస్తున్నాం అని మోదీ తెలిపారు. 

త్వరలో కార్ల తయారీ సంస్థ కియా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న సంస్థల్లో ఒకటి కానున్నదన్నారు. జీఎస్టీ అమలుతో సులభ వాణిజ్యంలో భారత్ స్థానం 77వ స్థానానికి చేరుకున్నదని, వచ్చే ఏడాది 50వ ర్యాంక్‌కు చేరుకోవాలని తమ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నదని చెప్పారు. 

వచ్చే 15 ఏండ్లలో మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ జీఎస్టీ, ముద్రా తదితర పథకాలను తమ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.