ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్‌ల గొంతు ఒక్కటే

దేశ ఆత్మస్థయిర్యాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వైఖరినే కాంగ్రెస్ అనుసరిస్తోందని దుయ్యబట్టారు.

ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ అధికార ప్రతినిథుల ఉద్దేశాలు వేరు కావచ్చునేమో కానీ, వారి వైఖరి మాత్రం ఒకే విధంగా ఉందని మండిపడ్డారు. వారి (పాకిస్థానీలు) ప్రధాన మంత్రి (ఇమ్రాన్ ఖాన్) చెప్తున్న మాటలనే మన ప్రధాన ప్రతిపక్షం చెప్తున్నందుకు పాకిస్థాన్‌లో సంబరాలు జరుగుతూ ఉండి ఉంటాయన్నాని ఎద్దేవా చేశారు. 

దేశమంతా ఏకమైందని, పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఒక దేశం తర్వాత మరొక దేశం తీర్మానాలు చేస్తూ, భారత దేశానికి మద్దతుగా నిలుస్తున్న తరుణంలో, ఇలాంటి సంక్లిష్ట సమయంలో, కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని, దేశ ఆత్మస్థయిర్యాన్ని బలహీనపరిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదం వెన్ను విరిచిందని చెప్పారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో 728 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. తమ ఆలోచనా ధోరణికి, కాంగ్రెస్ ఆలోచనా వైఖరికి చాలా తేడా ఉందని తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైనవారి కుటుంబ సభ్యులను తనతోపాటు అందరు కేంద్ర మంత్రులు పరామర్శించి, ఓదార్చామని చెప్పారు. 

అయితే, దేశ పురోగమనం ఆగిపోకూడదని, అభివృద్ధి కోసం జరుగుతున్న కృషి నిలిచిపోకూడదని తాము కోరుకుంటున్నట్లు వివరించారు. ఉగ్రవాద దాడులపై రాజకీయం చేయకూడదని రవిశంకర్ ప్రసాద్ హితవు చెప్పారు. 

‘‘అమరుడైన సీఆర్‌పీఎఫ్ జవాను పార్దివ దేహం ఢిల్లీ చేరిన సమయంలో రాహుల్ గాంధీ తన ఫోన్‌లో ఏదో చూసుకుంటూ కెమెరాకు చిక్కారు. దానిపై మేము వివాదం రేపామా? వివాదం రేపాలని మేము కోరుకుని ఉండి ఉంటే, అలాగే చేసేవాళ్ళం’’ అని చెప్పారు.