చంద్రబాబు, జగన్ లతో ఏపీ అభివృద్ధి కాదు


చంద్రబాబు, జగన్‌ వల్ల ఏపీ అభివృద్ధి కాదని,  ప్రధాని నరేంద్ర మోదీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పాలన పార్టీలంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలు అని విమర్శించారు. రాజమహేంద్రవరంలో బుధవారం అమిత్‌ షా బిజెపి కార్యక్రమాలలో పాల్గొంటూ   రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ సీఎం ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.  నాడు మోదీ ఇమేజ్‌తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు చెప్పారు. 

తొలుత క్వారీ మార్కెట్‌ సెంటర్‌ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం లాలాచెరువు వద్ద ఉభయగోదావరి జిల్లాల పదా ధికారుల సమావేశంలో ఆయన పాల్గొంటూ ఏపీ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి రావడం సంతోషంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. పుల్వామా ఘటనపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తుతూ  చంద్రబాబుకు పాక్‌ ప్రధానిపై ఉన్న నమ్మకం.. మన ప్రధానిపై లేదని మండిపడ్డారు.  

పుల్వామాఉగ్రదాడిని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని చూస్తోందని అమిత్‌షా మండిపడ్డారు. సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.   రాజకీయాలకు కూడా హద్దు ఉండాలని హితవు చెబుతూ సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోదీ వ్యవహరిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.

‘‘ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నా. అమరులైన జవాన్లకు ఈ వేదిక నుంచి నివాళులు అర్పిస్తున్నా. ఈ ఐదేళ్లలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. భారత సైనికులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రదాడిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది" అని పేర్కొన్నారు. 

విభజన అంశాలను 90 శాతం నెరవేర్చాం 

ఏపీ విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చామని అమిత్ షా ప్రకటించారు.  ‘‘చంద్రబాబు దిల్లీ, కోల్‌కతా వెళ్లి ధర్నాలు చేశారు. ఆయన ధర్నా చేయాల్సింది వారి పార్టీ ముందే. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో తెలంగాణలో ప్రచారం చేస్తూ..మాపై దుష్ప్రచారం చేస్తున్నారు" అని విమర్శించారు. 

అమరావతి, పోలవరానికి మేం నిధులు ఇచ్చినప్పటికీ వాటిని ఇక్కడి ప్రభుత్వం చేయకుండా భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.  ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని చెబుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ.180 కోట్లు ఇచ్చామని, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. 

కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీ చరిత్రలో ఇన్ని ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదని తెలిపారు. కేంద్రం కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకంతో ఏపీకి అత్యంత లబ్ధి పొందిదని పేర్కొన్నారు.