విజయవాడలో ఎయిమ్స్‌లో తరగతులు ప్రారంభం

ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అతి తక్కువ ఖర్చుతో వైద్యవిద్యను తొలిసారిగా అందిస్తున్నట్లు ఎయిమ్స్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. అమరావతిలోని మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) మొదటి సంవత్సర ఎంబీబీఎస్‌ తరగతులను విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ఒక్కో విద్యార్థి కేవలం రూ.24వేలకే (అన్ని సంవత్సరాలకు కలిపి) వైద్యవిద్యను పూర్తిచేస్తారని తెలిపారు. 2020 నాటికి ఎయిమ్స్‌ పూర్తిస్థాయి ప్రాంగణాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. సిద్ధార్థ వైద్యకళాశాలలో రూ.7కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆధునిక డిజిటల్‌, వర్చువల్‌ తరగతి గదులను ఎయిమ్స్‌ బృందంతో కలిసి రవికుమార్‌ ప్రారంభించారు.

మొత్తం 50 మంది విద్యార్థులతో మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు తెల్లకోటును అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుండెపోటు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయం(గోల్డెన్‌ అవర్‌)లో వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలను నిలబెట్టే విధానంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నమూనా సాధన చేయించారు.

కార్యక్రమంలో సిద్థార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశాంక్‌, ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌) శర్మ్‌దీప్‌ సిన్హా, డీన్‌ ఘోషల్‌ తదితరులు పాల్గొన్నారు.