రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోయిందని వరద నష్టం

వరదల కారణంగా జరిగిన నష్టం రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోయిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.  మొత్తం 483 మంది చనిపోయారనీ,  మరో 15 మంది జాడ ఇప్పటికీ తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు. వరద విపత్తుపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత వందేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. మొత్తం 14.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చిందన్నారు.

‘‘ప్రస్తుతం 305 పునరావాస కేంద్రాల్లో 59,296 మంది ఆశ్రయం పొందుతున్నారు. 57 వేల హెక్టార్లలో పంటలు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా జరిగిన నష్టం రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉంది...’’ అని పేర్కొన్నారు. వర్షాల గురించి వాతావరణ శాఖ తగిన హెచ్చరికలు జారీచేస్తూనే ఉందనీ.. అయితే ఇంతకు ముందెన్నడూ లేనంత అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించాయని వివరించారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 9 నుంచి 15 వరకు 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా... ఏకంగా 352.2 మిల్లీమీటర్ల మేర కుండపోత వర్షాలు కురిశాయని సీఎం వెల్లడించారు. కాగా ప్రభుత్వం వివరణతో కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ విభేధించారు. ‘‘మానవ తప్పిదం కారణంగానే వరదలు ముంచెత్తాయంటూ’’ దుయ్యబట్టారు. అర్థరాత్రి వేళ ఉన్నపళాన అనేక డ్యామ్‌ల నుంచి వరదనీటిని వదిలారనీ దీనికి కారకులెవరో ముందు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, చర్చలో తొమ్మిది మంది సిపిఎం సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వగా వరదల సందర్భంగా ప్రభుత్వ ధోరణిపై విమర్శలు కురిపిస్తున్న ఇద్దరు అధికార పక్ష సభ్యులను మాత్రం మాట్లడనీయ లేదు. ప్రభుత్వం నిరవిస్తున్న సహయ కార్యక్రమాలను తప్పు పట్టడమే కాకుండా, అర్ధంతరంగా ఒకేసారి అన్ని డ్యామ్ లలో నీరు వదలడం కారణంగానే ఇతటి ఉపద్రవం యేర్పడినదని దయ్యబడుతూ వచ్చారు. వారిద్దరి పట్ల సియం విజయన్, సిపియం నాయకత్వం ఆగ్రహంగా ఉన్నది.