పుల్వామా ఘటనను రాజకీయంచేస్తున్న చంద్రబాబు

పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు బాసటగా నిలుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం పుల్వామా ఘటనను రాజకీయంచేస్తూ ప్రధాని మోదీపై అక్కసును వెళ్ళగక్కుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఏపీ బీజేపీ ఎలక్షన్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుయ్యబట్టారు. 

ఇది దేశభక్తి ప్రేరేపిత తరుణమని కూడా మర్చిపోయి చంద్రబాబునాయుడు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. అసలు దేశభక్తి అంటే చంద్రబాబునాయుడుకు, ఆయన కొడుక్కి కూడా తెలియదని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడుకు ఏనాడూ దేశభక్తి గురించి గానీ, దేశభక్తిని ఆకాంక్షించే కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ అతనికి తెలియదని విమర్శించారు. 

పుల్వామా ఘటన నేపథ్యంలో అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ చిన్న పిల్లలు, అతి సామాన్యులు సైతం దేశభక్తిని ప్రదర్శిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, చంద్రబాబునాయుడు ఈ ఘటనను రాజకీయంగా మాట్లాడటం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ప్రధాని నెహ్రూ విధానంవల్లే కాశ్మీర్ సమస్య నేటికీ రావణకాష్టంగా మారిందని గుర్తు చేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు.చంద్రబాబునాయుడు మానసికంగా రక రకాల ఆందోళనలకు గురవుతూ ఇటీవల జరిగిన విద్రోహ దాడిని తెలియజేయడంలో మోదీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇటువంటి కార్యక్రమాలు ఉద్భవించాయని అనడం ఆయన ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని సోము విమర్శించారు. 

ఈ ఘటనను బాబు ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించడం జాతి క్షమించదని హెచ్చరించారు. గుజరాత్ గోద్రా సంఘటనను గుర్తుచేసుకుంటున్న చంద్రబాబునాయుడు మోదీ కాళ్ళు పట్టుకుని ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పుల్వామా అమానుష ఘటనపై రాజకీయాలకు తావులేదని, ఇది ఎన్నికలకు ముడిపెట్టే అంశంకాదని స్పష్టం చేశారు. సాధ్యమైతే పరిష్కారానికి ఆలోచనచేయాలి గానీ, రాజకీయం చేయడం చంద్రబాబుకు సబబుకాదని హితవు చెప్పారు. 

ప్రతీ సామాన్యుడు ఈ ఘటనను ఖండిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం రాజకీయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు ఎపుడైనా వందేమాతరం గానీ, భారత్ మాతాకీ జై అని గానీ అన్నారా, ఎపుడైనా దేశభక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. దేశభక్తి ప్రదర్శించడానికి చంద్రబాబు అనర్హుడని స్పష్టం చేశారు. దేశభక్తి పరాయణత కలిగిన బీజేపీ త్యాగాలు అనుసరణనీయమని, బీజేపీ దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ అని తెలిపారు. చంద్రబాబునాయుడు భావజాలాన్ని తెలియజేస్తూ అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామని హెచ్చరించారు.