ఉగ్రవాదం, తీవ్రవాదం ఉమ్మడి సమస్యలన్న సౌదీ యువరాజు

ఉగ్రవాదం, తీవ్రవాదం ఉమ్మడి సమస్యలని, వాటిని ఎదుర్కొనేందుకు భారత్‌తోపాటు పొరుగుదేశాలన్నింటికీ సహకరిస్తామని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు. ఒకరోజు భారత పర్యటనకు వచ్చిన సల్మాన్ ప్రధాని నరేంద్రమోదీతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ఆశ్రయమిచ్చిందని భారత్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సౌదీ యువరాజు ఆ దేశంలో పర్యటించి భారత్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇద్దరు నేతలు ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉభయ దేశాల మధ్య ద్వైవార్షిక సదస్సులు జరుగాలని, ఓ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. భారత్ హజ్ కోటాను సౌదీ మరో 25 వేలు పెంచింది. దీంతో భారత్‌కు చెందిన రెండు లక్షల మంది ప్రతి ఏటా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఏర్పడింది.అలాగే ఇంధనం, పెట్రో కెమికల్స్, ఉత్పత్తి రంగాలలో పదివేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. 

ప్రధాని విజ్ఞప్తి మేరకు.. సౌదీ అరేబియాలోని వివిద జైళ్లలో ఉన్న 850 మంది భారతీయులను విడుదల చేయాలని సౌదీ యువరాజు ఆదేశించారు. మరో వైపు భారత్‌కు చెందిన 15 ప్రైవేటు సంస్థలు సౌదీలో పెట్టుబ డులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. చర్చల అనంతరం ఇద్దరు నేతలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఉగ్రవాదుల కిరాతకానికి పుల్వామా దాడి ఓ క్రూరమైన చిహ్నం అని, ఇందుకు కారణమైన వారిని, వారికి మద్దతు తెలిపే వారిని శిక్షించాలని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు. పుల్వామా దాడి ప్రపంచానికి పొంచి ఉన్న అమానవీయ ప్రమాదాన్ని సూచిస్తున్నదని తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశాలపై ఒత్తిడి తేవాలని భారత్, సౌదీ నిర్ణయించాయని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరమని చెప్పారు. 

సౌదీ యువరాజు మాత్రం తన ప్రకటనలో పుల్వామా ఉగ్రదాడిని గూర్చి ప్రస్తావించలేదు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఉమ్మడి సమస్యలని, వాటిని ఎదుర్కొనేందుకు తాము భారత్‌తోపాటు ఇతర పొరుగుదేశాలకు నిఘా సమాచారాన్ని అందజేయడం వంటి సహాయంతోపాటు ఇతర అంశాల్లో తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తొలుత పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ యువరాజు సల్మాన్ అక్కడి నుంచి స్వదేశం వెళ్లి తిరిగి భారత్‌కు మంగళవారం రాత్రి వచ్చారు. ప్రధాని స్వయంగా విమానాశ్రయం వెళ్లి సల్మాన్‌కు ఆహ్వానం పలికారు.

ఉగ్రవాదులపైనే కాకుండా ఉగ్రవాదానికి మద్దతునిచ్చి, నిధులందజేసే వారిపైన కూడా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడానికి తాము వ్యతిరేకం కాదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. మసూద్‌పై ఐరాస నిషేధం విధించడాన్ని సౌదీ వ్యతిరేకిస్తుందన్న వార్తలను తోసిపుచ్చింది. 

కాగా, భారత్ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదం బాధితురాలిగా ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే.. ఉగ్రవాదులు భారత సరిహద్దుకు అవతల ఉన్న దేశం మద్దతును పొందుతున్నారని, అక్కడే వారికి ఆశ్రయం లభిస్తున్నదని తెలిపారు. అన్ని దేశాలు ఇతరులపైకి ఉగ్రవాదాన్ని ప్రయోగించడం నిలిపివేయాలని, వారికి నిధులు అందజేయడం ఆపాలని రెండు సౌదీ పత్రికలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సౌదీ యువరాజు భారత్‌లో పర్యటించిన రోజునే మోదీ ఇంటర్వ్యూ సౌదీలో ప్రచురితమైంది. ఉగ్రవాదం, తీవ్రవాదంతో ప్రపంచంలోని అన్ని దేశాలు, సమాజాలు ముప్పును ఎదుర్కొంటున్నాయని ప్రధాని తెలిపారు.