మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం

రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు, స్వర్గీయ ఎన్టిఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య హరికృష్ణ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హరికృష్ణ చితికి ఆయన రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ నిప్పటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

అంతకుముందు అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు దాదాపు గంటన్నరపాటు అంతిమయాత్ర సాగింది. ‘రథసారధి’కి అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు.

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం  జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకోసం  ప్రత్యేకంగా 300 గజాల  స్థలాన్నికేటాయించిన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.

ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు మొదట అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,తుమ్మల నాగేశ్వరరావు, ఏపీమంత్రులు కేఇ కృష్ణమూర్తి, నారా లోకేశ్‌, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.