ఇంజనీర్లను గేలి చేసిన రాహుల్, అఖిలేష్.. మోదీ ధ్వజం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించిన మరుసటిరోజే.. సాంకేతి క కారణాల వల్ల బ్రేక్‌డౌన్ కావడంతో ‘ప్రధాని మేకిన్ ఇండియా’ విఫలమైందని రాహుల్‌గాంధీ, విద్యుత్ సరఫరా నిలిచిపోయినందున రైలు నిలిచిపోయిందని అఖిలేష్ యాదవ్ లు  వ్యంగ్యోక్తులు కురిపించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.   వీరిద్దరు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావి స్తూ వారిద్దరూ మన దేశ ఇంజనీర్లను గేలి చేశారని ధ్వజమెత్తారు. 

రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ సెమీ హైస్పీడ్ రైలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై అత్యంత గర్హనీయమన్న ప్రధాని ‘మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించేవే’అని వారణాసిలో జరిగిన బహిరంగసభలో  దుయ్యబట్టారు. ప్రయాణికులకు సౌకర్యం కలిగేంచేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చాం. అయితే కొందరు వ్యక్తులు హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని ఎగతాళి చేసేలా మాట్లాడుతున్నారు. ఇది అత్యంత దురదృష్టరం. ఒక విధంగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమే’అని మోదీ నిప్పులు చెరిగారు. 

ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను విమర్శలు చేయనీయండి అన్న ప్రధాని ‘దేశంలో బుల్లెట్ రైలు కూత కూస్తుంది’అని ప్రకటించారు. ‘ఇంజనీర్లకు నా సలాములు. మీరే భవిష్యత్‌లో బుల్లెట్ రైలునుపట్టాలెక్కించాల్సింది’అని ఆయన వ్యాఖ్యానించారు. నిపుణలపై చౌకబారు విమర్శలు చేసే వారికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందని, ప్రజల ఆగ్రహానికి గురికావడం ఖాయమని ప్రధాని మోదీ హెచ్చరించారు. 

రైలుకు జెండా ఊపిన మోదీ 

డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మారిన మొట్టమొదటి రైలును ప్రధాని నరేంద్ర మోదీ  వారణాసిలో జెండా ఊపి ప్రారంభించారు.బ్రాడ్ గేజ్ విభాగంలోని రైళ్లన్నింటినీ ఎలక్ట్రిక్ మార్గాలుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. డీజిల్ లోకోమోటివ్స్ వర్క్స్‌‌ల రైలును ప్రారంభించిన మోదీ అనం తరం దానిని క్షుణ్ణంగా పరిశీలించారు.

డిసెంబరు 22, 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం 69 రోజుల్లో పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వేలో పూర్తిగా విద్యుదీకరణ చేపట్టాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. 

వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ వద్ద ప్రధాని మోదీ మంగళవారం సూపర్‌ కంప్యూటర్‌ ‘పరమ్‌ శివాయ్‌’ను ఆవిష్కరించారు. జాతీయ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ కింద దాదాపు రూ. 32.5 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందించిన ఈ కంప్యూటర్‌ సామర్థ్యం 833 టెరాఫ్లాప్‌. సంస్థ శత వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను కూడా ప్రధాని విడుదల చేశారు.