ప్రభుత్వం మెడకు చుట్టుకొంటున్న రైతు కోటయ్య మృతి

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు పిట్టల కోటేశ్వర్‌రావు మృతి ఘటన చంద్రబాబు నాయుడు  ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది. ప్రభుత్వ పెద్దల తీరు కూడా తీవ్ర వివాదాస్పదమవుతున్నది. రైతు మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సోమవారం చారిత్రక కొండవీడు కోటలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కొత్తపాలెం గ్రామ రైతు పిట్టల కోటేశ్వర్‌రావు(40) అనుమానాస్పదరీతిలో చనిపోయారు. సీఎం పర్యటన కోసం కోటేశ్వర్‌రావు పొలాన్ని ఆక్రమించి బొప్పాయి తోటను నాశనంచేయడంతో ఆయన ప్రశ్నించారు. దాంతో రైతును పోలీసులు తీవ్రంగా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని కనీసం దవాఖానకు తరలించకపోవడంతో రైతు మృతి చెందాడనే ఆరోపణలున్నాయి.

రైతు కోటేశ్వర్‌రావును మీరే చంపారంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం హెలికాప్టర్ దిగడానికి రైతు బొప్పాయి తోటను నాశనంచేశారని, పొలంలోకి వెళ్లేందుకు యత్నించి పోలీసులు కొ ట్టిన దెబ్బలకు రైతు నేలకొరిగాడని ఆరోపించారు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారని, మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటని చంద్రబాబును ట్విట్టర్‌లో నిలదీశారు. 

సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీ స్తారా? అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దౌర్జన్యంచేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.తన ప్రచారం కోసం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని  కన్నా  డిమాండ్‌ చేశారు.

కొండవీడు కోట ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభ నిర్వహణ కోసం తన పంట పొలాన్ని నాశనం చేస్తుంటే అడ్డుకున్న రైతు కోటేశ్వరరావును టిడిపి  శ్రేణులు, పోలీసులు కొట్టి చంపారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రైతును ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, చంద్రబాబు వస్తున్నారంటూ ఆంక్షలు విధించి.. మరణించాక శవాన్ని అతడి ఇంటి ముందు పడేసి వెళ్లారని విమర్శించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయని గుర్తుచేశారు.  

అయితే రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే.. వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని ఘాటుగా స్పందించారు.  పోలీసులు తప్పు చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శిస్తుందని వైసిపి  కేంద్ర కార్యాలయం ప్రకటించింది.