జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో నేడు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది.

కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు.

రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనున్నది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది.

గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్‌పోస్టుల భర్తీలో కల్పించిన రిజర్వేషన్ల నిష్పత్తి వల్ల కూడా తెలంగాణలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. జిల్లా పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ లేదు.

దీనికితోడు ఓపెన్ క్యాటగిరీకి నాన్‌లోకల్ అని పేరు తగిలించి స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టారు. స్థానికులైన మెరిట్ అభ్యర్థులకు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు కేటాయించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తీరని నష్టం జరిగింది.