తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఖరారు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో పొత్తుల వ్యవహారంలో మరో కీలకమైన అడుగు పడింది. బలమైన కూటమి ఏర్పాటుకానున్నట్లు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గత వారం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చింది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బిజెపి, పీఎంకే కలసి పోటీ చేయడానికి నిర్ణయించారు. బిజెపి ఎన్నికల రాష్ట్ర ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జరుపుతున్న మంతనాలు కార్యరూపం దాల్చాయి. 

ఈ పొత్తులో భాగంగా బిజెపి ఐదు సీట్లలో, అన్నాడీఎంకే 27 సీట్లలో, పీఎంకే 7 సీట్లలో పోటీ చేస్తాయి. 21 అసెంబ్లీ సీట్లకు జరుగనున్న  ఉపఎన్నికలలో అన్నాడీఎంకే అభ్యర్థులకు బిజెపి మద్దతు ఇస్తుంది. మహారాష్ట్రాలో బిజెపి-శివసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు అయిన మరుసటి రోజే తమిళనాడులో బిజెపి పొత్తు ఖరారు కావడం గమనార్హం.  

అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పనిచేస్తాయని, ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరిక ఖరారైందని పీయూష్ గోయెల్ ప్రకటించారు. పుదుచ్చేరి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇటు రాష్ట్రంలో పన్నీర్, పళని సెల్వం నాయకత్వంలోనూ, అటు కేంద్రంలో మోదీ నాయకత్వంలోనూ పనిచేసేందుకు తాము అంగీకారానికి వచ్చామని, తమిళనాడు ఉప ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. 

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ 5 స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. కాగా, అన్నాడీఎంకే 27 స్థానాల్లో, పీఎంకే 7 స్థానాల్లో పోటీ చేస్తాయి. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు పాల్గొన్నారు.