కేసీఆర్ మంత్రివర్గంలో హరీశ్‌రావు ఔట్

ముఖ్యమంత్రిగా రెండోసారి కేవలం ఒక మంత్రితో ప్రమాణస్వీకారం చేసిన  కే చంద్రశేఖర్‌రావు   రెండు నెలలకు పైగా గడిచిన తర్వాత  మంత్రివర్గాన్ని   కే చంద్రశేఖర్‌రావు నేడు 10 మంది మంత్రులతో విస్తరించారు. అనుకున్నట్లుగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడైన కుమారుడు కె టి రామారావు రాజకీయ వారసత్వానికి అడ్డు వస్తారని భావిస్తున్న మేనల్లుడు, మాజీ సాగునీటి మంత్రి టి హరీశ్‌రావుకు స్థానం లభించలేదు. 

మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్‌, మంత్రి మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరుగుతోంది. మంత్రివర్గ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. 

గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు కొత్తగా ఎస్ నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి  లను మంత్రివర్గంలో చేర్చుకున్నారు.