ఇక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబరు 112

దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మంగళవారం నుంచి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబరు 112ను కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. దేశంలో మహిళల రక్షణకు ఈ హెల్ప్‌లైన్ దోహదపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్, దాదర్ నగర్ హవేలీ, డామన్, డయ్యూ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో మహిళల రక్షణకు ఈ హెల్ప్ లైన్ సేవలందించనుంది. 

పోలీసు (100) ఫైర్ (101), హెల్త్ (108) విమెన్ (1090) హెల్ప్ లైన్ నంబర్లన్నీ కలిపి ఒకే ఎమర్జెన్సీ నంబరు 112ను రూపొందించారు. 112 నంబరుకు ఫోన్ డయల్ చేసి స్మార్ట్ ఫోన్ లో పవర్ బటన్ ను మూడుసార్లు నొక్కితే చాలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటరుకు పోతోంది.

112 ఇండియా మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో ఉచితంగా లభిస్తోంది. అమెరికాలో 911 ఎమర్జెన్సీ సర్వీసుల తరహాలో 112 అన్ని రకాల అత్యవసర సర్వీసులు అందిస్తుందని హోంమంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు. 

దీంతోపాటు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, లక్నో, ముంబయి నగరాల్లో నిర్భయ ఫండ్ పథకం నిధులతో సేఫ్ సిటీ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.