మహారాష్ట్రాలో బీజేపీ, శివసేన 45 స్థానాలు గెలుస్తాయి

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు ఖరారైంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. 

సోమవారం సాయంత్రం ఫడణవీస్‌, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌లతో కలిసి మాతోశ్రీలోని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి వచ్చి చర్చించారు. అనంతరం ఇరు పార్టీలు కలిసి ఈ ప్రకటన చేశాయి.ఉత్తరప్రదేశ్‌ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. 

‘బిజెపి, శివసేన హిందుత్వ పార్టీలు. 25 ఏళ్లుగా మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. మా మధ్య విభేదాలు లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేయకపోయినప్పటికీ, ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాయి. రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్నాం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తాయి’ అని ఫడణవీస్‌ వెల్లడించారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన 48 స్థానాల్లో 45 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం శివసేన, బీజేపీ కలిసి పనిచేయాలని దేశ ప్రజలు కోరుకున్నారని, అందుకు శివసేన చీఫ్ కూడా సమ్మతి తెలిపారని తెలిపారు. ఇందుకు కాను ఉద్ధవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీ, శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 50-50 పద్దతిలో స్థానాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. గత పాతికేళ్లుగా బీజేపీ, శివసేన కలిసి పనిచేస్తున్నాయని ఫడ్నవిస్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో రెండు పార్టీల మధ్య విభేదాలున్నప్పటికీ సిద్దాంతపరంగా రెండు పార్టీలదీ హిందూత్వ అజెండానేనని స్పష్టం చేశారు. 

‘దేశ ప్రయోజనాల కోసమే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలిచి అధికారంలోకి వస్తుంది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని మా ఇరు పార్టీల చర్చల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్ చేశారు. మందిర నిర్మాణానికి మేము కట్టుబడే ఉన్నామని చెప్పాము. రాష్ట్ర విషయాల్లో శివసేన చేసిన కొన్ని డిమాండ్‌లకు మేము ఒప్పుకున్నాం’ అని ఫడణవీస్‌ వివరించారు.