కేవలం మోదీ హఠావో మాత్రమే

ప్రతిపక్ష పార్టీల నేతలకు ఏ సిద్ధాంతమూ లేదని, కేవలం మోదీ హఠావో అనే నినాదంతో మాత్రమే పని చేస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో పర్యటిస్తున్న ఆయన తమ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  ‘మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని వెల్లడించగలరా?’ అంటూ మహాకూటమి నేతలకు సవాలు విసిరారు

. ‘మీరు మీ ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఎందుకు ప్రకటించబోరు? మీలో రోజుకో నేత ప్రధానమంత్రిగా ఉండాలని మీరు  భావిస్తున్నారా? మహాకూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించాలి. 2019 ఎన్నికలు బిజెపికే కాదు దేశ ప్రజలకి కూడా ముఖ్యం. ప్రజలు శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి’ అని పిలుపిచ్చారు. 

‘రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి (సచిన్‌ పైలట్‌).. ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి (గహ్లోత్‌) తన పదవిని కాపాడుకునే ప్రయత్నాల్లోనే బిజీగా ఉన్నారు. దీంతో పరిపాలన బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీకి  గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది’ అని అమిత్‌ షా తెలిపారు. 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ ఉపేక్షించబోము. సరైన సమయంలో మన జవాన్లు ప్రతీకారం తీర్చుకుంటారు. వారి పిరికిపంద చర్యకు తగిన సమాధానం చెబుతారు. అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు మేము మద్దతుగా ఉంటాము’ అని ఆయన స్పష్టం చేశారు.