పాక్ తో ఇక చర్చల్లేవని స్పష్టం చేసిన ప్రధాని మోదీ

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఇక చర్చలు జరపాల్సిన అవసరం లేదని, నేరుగా వారిపై చర్యలు మాత్రమే తీసుకోవాలని అర్థమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో అర్జెంటీనా అధ్యక్షుడు మార్సియో పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఎంవోయూలు కుదిరాయి. ఈ సందర్భంగా మోదీ, మార్సియో సంయుక్తంగా మీడియాతో సమావేశంలో మాట్లాడారు. 

ప్రపంచ శాంతికి, స్థిర అభివృద్ధికి ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఉగ్రవాదులతో ఇక చర్చలు జరపకూడదని పుల్వామా ఉగ్రదాడితో స్పష్టమైంది. ఉగ్రవాదంపై, దానికి మద్దతు తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాలని ప్రధాని పిలుపిచ్చారు. 

‘ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో వెనకాడడం కూడా ఓ రకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. భారత్‌, అర్జెంటీనా ఈ రోజు సంయుక్తంగా ఉగ్రవాదంపై ఓ ప్రకటన విడుదల చేస్తాయి’ అని మోదీ తెలిపారు. 

అనంతరం మార్సియో మాట్లాడుతూ ఉగ్రవాదం నిరోధానికి భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ‘ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం ప్రకటిస్తున్నాను. ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాము. ఉగ్రవాద నిరోధానికి మేము భారత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండటంతో న్యూఢిల్లీలోని తమ దేశం హైకమిషనర్‌ను పాకిస్థాన్ వెనక్కి పిలిపించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ఓ ట్వీట్‌లో తెలిపారు. 'సంప్రదింపుల కోసం ఇండియాలోని హైకమిషనర్‌ను వెనక్కి పిలిచాం. ఈ ఉదయం ఆయన న్యూఢిల్లీ నుంచి బయలుదేరారు' అని ఫైజల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పుల్వామా ఘటన అనంతరం ఇండియాలోని పాక్ హై కమిషనర్ సొహైల్ మెహమూద్‌ను గత శుక్రవారంనాడు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తన కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఇండియన్ హై కమిషనర్‌ అజయ్ బైసరియాను సైతం సంప్రదింపుల పేరుతో భారత్ వెనక్కి పిలిచింది. ఆసక్తికరంగా, గత శుక్రవారంనాడు పాకిస్థాన్‌లో అమెరికా రాయబారి పాల్ జోన్స్ సైతం పాక్ విదేశాంగ కార్యదర్శి జాన్‌జుయాను కలిసి...పుల్వామా దాడిపై అమెరికా వైఖరిని కుండబద్ధలు కొట్టారు.