ఉగ్రదాడి అసలు వ్యూహకర్త ఐఎస్‌ఐ అధిపతి మునీర్

పాక్‌ నిఘాసంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ అదినేత ఆసీం మునీర్‌ కన్నుసన్నల్లోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని స్పష్టం అవుతున్నది. గతంలో ఆ దేశ సైనిక కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌లోని భౌగోళిక అంశాలపై బాగా పట్టుంది. గత అక్టోబరులో అతన్ని పాక్‌ సైనికాధిపతి జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా ఐఎస్‌ఐ అధిపతిగా నియమించారు.  భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు ఐఎస్‌ఐ కీలక సలహాదారుగా వ్యవహరిస్తొందన్నది బహిరంగ రహస్యమే. 

భారత్‌లో ఉగ్రదాడి జరిపేందుకు మునీర్‌ కుట్రపన్నుతున్న సమయంలోనే జైష్‌ కూడా కలవడంతో పుల్వామా దాడికి వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి మొదటివారంలోనే ఈ దాడి చేయాలని నిర్ణయించినప్పటికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొద్దిరోజుల పాటు వాయిదా వేసి 14న అమలు చేసినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

జైష్‌ ఉగ్రవాది అదిల్‌ దర్‌కు వాహనంతో పాటు ఆర్డీఎక్స్‌ను స్థానిక స్లీపర్‌సెల్స్‌ సాయంతో అందజేయడం వెనుక ఐఎస్‌ఐ హస్తమున్నట్లు తెలుస్తోంది. కొద్దినెలల క్రితమే ఐఎస్‌ఐ అధిపతిగా నియమితులైన మునీర్‌ భారతదళాలపై దొంగదెబ్బ తీసి సైనికాధిపతి మెప్పు పొందేందుకు చేసిన యత్నంలో భాగమే పుల్వామా అని నిఘావర్గాలు పేర్కొన్నాయి. 

కశ్మీర్‌ సరిహద్దుల్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించివుండటంతో భారత్‌లోని కశ్మీర్‌పై మునీర్‌కు పూర్తి అవగాహన వుంది. ఈ పరిజ్ఞానంతోనే ఆయన జైష్‌కు అన్నిరకాలుగా సాయం అందించారు. పాక్‌ అధ్యక్షుడిగా ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉగ్రవాద తండాలు మరింతగా పుంజుకున్నాయి. సైన్యం మద్ధతుతో అధికారంలోకి రావడంతో ప్రభుత్వ మనుగడ సైన్యంపై ఆధారపడివుంది. 

సైన్యం, ఉగ్రవాదులు, జిహాదీ గ్రూపులపై చర్యలు చేపట్టే సాహసం అక్కడి ఏ ప్రభుత్వం చేపట్టలేదు. దీనికి తోడు ఇమ్రాన్‌ ఖాన్‌ సొంతపార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీలోని పలువురు సభ్యులు గత ఎన్నికల్లో ఉగ్రవాదుల మద్ధతుతో గెలిచినవారు కావడం విశేషం.  జైష్‌, లష్కర్‌ లాంటి సంస్థలను పాక్‌ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయితే ఆ నిషేధం కేవలం కాగితాలపై కనపడుతుంది కానీ వాస్తవంగా అమలులో ఉండదు. ఉగ్రవాద నేతలు బాహాటంగా తిరుగుతూ భారత వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు.